ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఎవరిస్తారో?

గత ఎన్నికల్లో చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మరి ఈ ఎన్నికల్లో చంద్రబాబు కేసీయార్ కి రిటర్న్ గిఫ్ట్..

Update: 2023-06-09 03:42 GMT

2018 తెలంగాణ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన 'రిటర్న్ గిఫ్ట్' పదం చాలా పాపులర్ అయింది. మరి కొన్ని నెలల్లో మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో సారి రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయాల్లో వేలు పెడితే కేసీఆర్ మళ్లీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు పేర్కొంటున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. దానిపై తెలుగుదేశం అనుకూల మీడియాలో భారీ ఎత్తున కవరేజ్ కూడా వచ్చింది. ఈ వ్యవహారాలన్నీ కేసీఆర్ కి ఆగ్రహం తెప్పించాయి.

అందుకే ఎన్నికల అనంతరం జరిగిన విజయోత్సవ వేడుకల్లో కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ సహకరించారు. ఇటీవల చంద్రబాబు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాని కలిసి తెలంగాణ ఎన్నికల్లో తాను భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసి పోటీ చేద్దామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు భాజపా అంగీకరిస్తే తెలుగుదేశం, భాజపా మధ్య పొత్తు పొడుస్తుంది. ఇదే నిజమైతే కేసీయార్ మళ్ళీ హర్ట్ అవుతారు. చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ భాజపా తెలంగాణాలో గెలిచినట్లైతే చంద్రబాబు కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లవుతుంది. మరి ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే !


Tags:    

Similar News