Revanth Vs Jagan : రేవంత్ అలా చేస్తే జగన్ కు లాభమా? నష్టమా?

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన పాల్గొంటే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న చర్చ ఉంది

Update: 2024-02-23 05:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణలో కేసీఆర్ ను మాటల్లో పోటీ ఇచ్చే నేత ఒక్క రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. అందుకే ఆయన ప్రసంగాలు యువత, కొన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణ విజయం సాధించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రేవంత్ రెడ్డి మాటలే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చేతల్లోనూ తన స్టయిల్ లో వెళుతున్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు లేకుండా చేసుకుని ముందుకు వెళుతున్నారు. అందరినీ కలుపుకుని వెళుతూ తన పదవికి ముప్పు రాకుండా ఆయన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తనపైన ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకుండా అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు గత రెండు నెలలుగా చేస్తున్నారు.

జాతీయ పార్టీ కావడంతో....
ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి వస్తారని అక్కడి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ లో అది సాధారణమే. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పొరుగున ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. వాళ్ల ప్రచారం ఏ మేరకు ఉపయోగపడిందీ అని పక్కన పెడితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మామూలే.
చంద్రబాబుపైన కూడా....
కానీ రేవంత్ రెడ్డి ఏపీకి వస్తే అక్కడ ఏం జరగబోతుంది. ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు పార్టీ ఉంది. మరొక వైపు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏపీలో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది. అక్కడ గెలుపు అనేది ఊహకు కూడా అందదు. కాకుంటే ఒకటో, రెండో స్థానాలను మాత్రం ఆశించవచ్చు. అవి కూడా అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఆ ఒకటి, రెండు స్థానాలు కూడా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ దక్కించుకోవడం కష్టమే. అయితే అక్కడకు వెళ్లిన రేవంత్ రెడ్డి జగన్ పైన సహజంగానే విమర్శలు చేస్తారు. ఎందుకంటే జగన్ తో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు. పెద్దగా పరిచయం కూడా లేదు. వయసులో ఇద్దరూ సమానమైనా.. జగన్ సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు.
జగన్ ను మాత్రమే...
అయితే కేవలం జగన్‌ను ఒక్కరిని మాత్రమే విమర్శించి వెళితే అది ఫ్యాన్ పార్టీకే ప్లస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్ పైనే మాటల దాడి చేసి చంద్రబాబును పన్నెత్తు మాట అనకపోవడాన్ని కూడా ప్రజలు గమనించే అవకాశముంటుంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అక్కడి ప్రజలు కూడా సహజంగానే కోరుకుంటారు. అలాగని అధికారంలోకి రాలేని కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం తప్ప చంద్రబాబును పొగడలేని పరిస్థితి. అదే జరిగితే జగన్‌కు అడ్వాంటేజీగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ప్రచారంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.


Tags:    

Similar News