జితేందర్‌ రెడ్డి 'ట్రీట్‌మెంట్‌' ట్వీట్‌.. అంతర్గతపోరుకు ఆజ్యం

తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి దున్నపోతులను ట్రాలీలోకి ఎక్కిస్తూ

Update: 2023-06-30 10:50 GMT

తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి దున్నపోతులను ట్రాలీలోకి ఎక్కిస్తూ.. ముందుకు కదలని ఒక దున్నపోతుని కాలితో తన్నుతాడు. ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ “బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఈ ట్రీట్మెంట్‌ అవసరం” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీని జితేందర్ రెడ్డి ట్యాగ్ చేశారు. అయితే అతని ట్వీట్ వైరల్ కావడంతో, మాజీ ఎంపీ దానిని తొలగించారు. మాజీ ఎంపీ తర్వాత మళ్లీ అదే పోస్ట్ చేసాడు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి అలాంటి చికిత్స అందించాలని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుదారులపై సోషల్ మీడియాలో ఆయన మండిపడ్డారు. అయితే సీనియర్ నాయకుడి చర్య అప్పటికే నష్టాన్ని మిగిల్చింది. పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో ఇది వరస పెట్టి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఇక ఈ ట్వీట్‌ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బీజేపీని ఎగతాళి చేసేందుకు ఉపయోగించుకున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇదే ట్రీట్‌మెంట్ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం జితేందర్ రెడ్డి ట్వీట్‌పై స్పందించారు.

ఇతరుల స్వేచ్ఛను అగౌరవపరిచేలా లేదా ఉల్లంఘించేలా ప్రవర్తించారని ఆయన అన్నారు. జితేందర్‌రెడ్డి ఆ ట్వీట్‌ ఎందుకు చేశారో, ఆయన ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలని ఈటల రాజేందర్ అన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఏది పడితే అది మాట్లాడకూడదని, అలా మాట్లాడి పార్టీ పరువు తీయొద్దని చెప్పారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత సీనియర్ నాయకులపై ఉందని గర్తు చేశారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించొద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

వివాదాస్పద ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత, వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జితేందర్ రెడ్డి బండి సంజయ్‌తో కలిసి వేదిక పంచుకున్నారు. మీడియాలో కథనాలు ప్రచారం చేస్తూ కాషాయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ప్రజల మనసుల్లో ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రయత్నిస్తున్నారని అన్నారు.

జితేందర్ రెడ్డి ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బిజెపి రాష్ట్ర శాఖలో అంతర్గత కలహాలను పోల్చడం, ప్రజలకు వివరించడానికి ఇది అద్భుతమైన మార్గం అని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఈ ట్వీట్ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సంజయ్ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు గత వారం సమన్లు ​​పంపింది. మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సంజయ్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. సంజయ్ కూడా నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. బిజెపి అవకాశాలను దెబ్బతీసేందుకు కెసిఆర్ పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పొరుగున ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంజయ్ వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీలోని ఒక వర్గం నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రసారం చేశారు. నాయకత్వాన్ని కూడా మార్చాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం వరకు దూకుడు పెంచి అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న కాషాయ పార్టీ అంతర్గత పోరుతో ఉలిక్కిపడింది. జితేందర్‌ చేసిన ట్వీట్‌, దానిపై స్పందించిన నేపథ్యంలో అంతర్గత పోరు మరింత ముదురుతుందని, ఎన్నికల వేళ పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News