BJP : జగన్ పై నేరుగా మోదీ విమర్శలకు దిగుతారా? యుద్ధానికి సై అంటారా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో రాష్ట్రంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో రాష్ట్రంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగే ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల వేళ ప్రధాని రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలా స్పందించనున్నారన్నది చర్చనీయాంశంగానే మారనుంది. గత పదేళ్ల నుంచి రాష్ట్ర విభజన హామీలు అమలుచేయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు విశ్వసించలేదు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నోటా కంటే అతి తక్కువ ఓట్ల శాతం సాధించాల్సి వచ్చింది.
అన్ని పార్టీలూ మద్దతు....
అదే సమయంలో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా సహకరిస్తూనే వస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి ప్రతి కీలక బిల్లు విషయంలోనూ టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీకి అండగా నిలుస్తున్నాయి. గతఎన్నికల ప్రచారం వేరు. అప్పుడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు తనంతట తాను బయటకు వెళ్లిపోయారు. అందుకే అప్పుడు చంద్రబాబును మోదీ నేరుగా విమర్శించగలిగారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా మార్చుకున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ. వైసీపీ అధినేత జగన్ తొలి నుంచి బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా మిత్రత్వం ఆయన హస్తిన స్థాయిలో నడుపుతున్నారన్నది వాస్తవం.
నేరుగా జగన్ పై...
ఈ సభలో జగన్ పై విమర్శలు మోదీ చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయాల్సి వస్తుంది. అయితే జగన్ పై వారసత్వం లాంటి విమర్శలు చేసేందుకు మోదీ సిద్ధపడరు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో వారసత్వ రాజకీయాల ఊసెత్తరు. ఇక అవినీతిపైనే ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. మద్యం, ఇసుక, ల్యాండ్ వంటి విషయాలపై రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను మోదీ చదివే అవకాశాలున్నాయంటున్నారు. నేరుగా జగన్ పై విమర్శలు చేయకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంపై మాత్రం ఆయన విమర్శలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే జనం నమ్మేందుకు అవకాశం ఉండదు. ఓట్ల బదిలీ జరగకపోవచ్చు. అందుకనే విమర్శలు వైసీపీపై మోదీ సూటిగానే చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై...
మరోవైపు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2014 ఎన్నికల తర్వాతనే ప్రకటించడంతో ఆ అంశాన్ని పక్కన పెడతారంటున్నారు. మరో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టుపై మాత్రం ఆయన విమర్శలు నేరుగా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. మరో సున్నితమైన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ. దీనిపై కూడా ప్రధాని స్పందించే అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయడం ఖాయమంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో దాని ప్రస్తావన కూడా చేసే అవకాశం లేదు అని అంటున్నారు. మొత్తం మీద ఏ ఏ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారన్న ఆసక్తి అన్ని రాజకీయ పార్టీల్లోనూ నెలకొని ఉంది.