Ys Jagan : ప్రయోగాలకు ఇది సమయం కాదు మిత్రమా.. రాజీ లేదంటున్న లీడర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడానికే సిద్ధమయ్యారు. ఇందులో రాజీ లేదని చెబుతున్నారు

Update: 2023-12-29 13:31 GMT

ys jagan

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ చేసింది స్వల్ప మార్పులైనా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట్ల మాత్రం కారు పార్టీ విజయం సాధించింది. అదే పంథాలో ఇప్పుడు జగన్ కూడా వెళుతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోవడానికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడమేనన్న విశ్లేషణలు వినిపించాయి. ఆయన అభ్యర్థులను మార్చిన చోట బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇందుకు ఉదాహరణలుగా వైసీపీ నేతలు చూపుతున్నారు. తెలంగాణ తరహాలో కాకుండా ఏపీలో తాను రెండోసారి విజయం సాధించాలంటే సిట్టింగ్‌లను మార్చడమే ముఖ్యమన్న నిర్ణయానికి జగన్ వచ్చారు.

కేసీఆర్ చేసినట్లు...
తెలంగాణలో కేసీఆర్ జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తప్పించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఆయన జనగామ నుంచి గెలుపొందారు. అదేరకంగా స్టేషన్ ఘన్‌పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. అక్కడ కూడా కడియం శ్రీహరి విజయం సాధించారు. ఇక ఆలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంను కాదని, కేసీఆర్ చివరి నిమిషంలో విజయుడికి ఇచ్చారు. అక్కడా కారు పార్టీ గెలుపొందిందన్న విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక్క ఖానాపూర్ లో మాత్రమే సిట్టింగ్ ను మార్చినా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. అందుకే జగన్ కూడా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలను యధాతధంగా ఉంచి కేసీఆర్ చేసిన ప్రయోగం చేయకూడదనే భావిస్తున్నట్లు కనపడుతుంది.
అన్ని ప్రాంతాల్లోనూ...
అందులో భాగంగానే సిక్కోలు నుంచి సీమ ప్రాంతం వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు సిద్ధపడుతున్నారు. ఉన్నోళ్లు ఉంటారు.. వెళ్లే వాళ్లు వెళతారు అన్న ధోరణి జగన్ లో కనిపిస్తుంది. తనకు కావాల్సింది విజయం మాత్రమే. అది దక్కించుకుంటే చాలు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో రాజీ పడితే అసలుకే ఎసరు వస్తుందని జగన్ తెలంగాణ ఎన్నికలు జరిగిన తీరును చూసి గుర్తించారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకూ ఎవరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. గత పది రోజులుగా ఆయన పిలిచి మాట్లాడుతున్నారు. కొందరిని వేేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయిస్తుండగా, మరికొందరిని పార్లమెంటు స్థానానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరికి టిక్కెట్లు...
గోరంట్ల మాధవ్ లాంటి వారికి టిక్కెట్ ఇచ్చేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలను కూడా జగన్ పరిశీలనలోకి తీసుకుని టిక్కెట్లను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జిల్లాల వారీగా సామాజికవర్గాల సమీకరణాలు తప్పకుండా జగన్ సీట్లలో కొత్తవారిని దింపేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఎనభై రోజుల సమయం ఉండటంతో అలకలు, అసంతృప్తులు వెంటనే పైకి కనిపించినా ఎన్నికల నాటికి సర్దుకుంటాయన్న ధీమాలో జగన్ ఉన్నారు. అందుకే ఎవరి విషయంలో రాజీ పడబోనని ఆయన ఖరాఖండీగా చెబుతున్నారు. తనను ఎదుర్కొనేందుకు కూటమితో ముందుకొస్తున్న వారిని ధీటుగా ఎదుర్కొనాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదని జగన్ భావిస్తున్నారు. అందుకే సర్వే నివేదికలతో పాటు సామాజికవర్గాల సమీకరణాలతో అభ్యర్థులను మార్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.


Tags:    

Similar News