జ‌గ‌న్ హెచ్చ‌రిక‌.. ఎమ్మెల్యేల్లో గుబులు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం వైఎస్‌ జగన్‌ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడప గడపకు మన

Update: 2023-06-21 14:16 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం వైఎస్‌ జగన్‌ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన వైఎస్‌ జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ చేసిన హెచ్చరికలు.. ఎమ్మెల్యేల్లో గుబలు పెంచాయి. ఈ వర్క్‌షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్‌ సమీక్షించారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్‌ జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ముఖ్యంగా 20 మంది ఎమ్మెల్యేల పని తీరు ఏ మాత్రం బాగోలేదని, వారందరినీ త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానని సీఎం జగన్‌ తేల్చి చెప్పినట్లు తాడేపల్లి వర్గాలు చెప్పాయి. పర్సనల్‌గా కలిసి చెప్పినా.. పనితీరు మారకపోతే మాత్రం తాను నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేల్లో కూడా దాదాపు సగం మంది పని తీరు మెరుగుపర్చుకోవాల్సిందేనన్నారు. పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామన్న వైఎస్‌ జగన్‌.. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీ నష్టమవుతుందని స్పష్టం చేశారని సమాచారం. ఇప్పటి వరకూ చేసిన సర్వే రిపోర్టులన్నీ తన దగ్గర ఉన్నాయని సీఎం జగన్‌ చెప్పారు. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్న రీతిలో ఇక నుండి ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరగాల్సిందేనని జగన్‌ తేల్చి చెప్పారు.

ప్రతి ఇంటికీ వెళితే ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరుగుతుందని, లేకపోతే కష్టమేనని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. ఒక వేళ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని వైఎస్‌ జగన్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదని కూడా జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని విమర్శలకు కౌంటర్ల వర్షం కురిపించాలన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  

Tags:    

Similar News