పవన్‌పై కాదు.. ముందు జగన్‌పై కేసు పెట్టాలి: చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు

Update: 2023-07-21 10:41 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు . ప్రశ్నించే రాజకీయ పార్టీలపై కేసులు పెట్టడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పవన్‌ కల్యాణ్‌పై పెట్టిన పరువునష్టం కేసును బుద్ధిహీనమైన, అనైతిక చర్యగా అభివర్ణించిన ఆయన, ఆందోళనలు చేసే వారిపై ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల వివరాల సేకరణపై ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలకు సమాధానం చెప్పకుండా పవన్ కల్యాణ్‌పై ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేయడం గర్హనీయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సీఎం జగన్ దుర్వినియోగం చేశారని, ప్రశ్నించే వారిపై వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ''నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు.. కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు.. పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి.'' అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరంగా మారిందన్నారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అని చంద్రబాబు అన్నారు. 4 ఏళ్ల దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయన్నారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టాలని, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. 

Tags:    

Similar News