కుట్రలతో వారాహి యాత్ర: ఆళ్ల నాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆళ్ల నాని. పవన్ భాష చూసి ప్రజలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆళ్ల నాని. పవన్ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లడానికే పవన్ వారాహి యాత్ర అని దుయ్యబట్టారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆళ్ల నాని మాట్లాడారు. నాయకులు ప్రజల వద్దకు వెళ్లి తమకు అధికారం ఇస్తే పలానా మేలు చేస్తామని చెబుతారు, కానీ పవన్ మాత్రం సీఎం జగన్‌ను విమర్శించడానికే యాత్ర చేస్తున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. చంద్రబాబుని సీఎం చేయాలన్న లక్ష్యంతో పవన్ పని చేస్తున్నారని అన్నారు.
తమను దూషిస్తున్నా సహనంతో ఉన్నామంటే, అది చేతగానితనం అనుకోవద్దన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించారనే అక్కసుతో పవన్ మాట్లాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆళ్ల నాని ఆరోపించారు. రాయలసీమ గూండాలు అంటూ ప్రాంతాల మధ్య అల్లర్లు సృష్టిస్తున్నారని, రాయలసీమలో ఫ్యాక్షన్ అనేదే లేదన్న విషయం రాష్ట్రమంతటా తెలుసునన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం కులాలు, ప్రాంతాలను వాడుకుంటున్నారని ఆళ్ల నాని నిప్పులు చెరిగారు.
వారాహి యాత్ర ఇలాగే కుట్రలతో సాగితే గోదావరి జిల్లాల్లో జనసేన ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. పవన్ నిలకడలేని మాటలు మాట్లాడుతాడని, అది ఆయనకే చెల్లుతుందన్నారు. . చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది ఒకే గొంతు, ఒకే నాలుక. ఇద్దరూ పక్కా ప్రణాళిక ప్రకారం మాట్లాడుతున్నారని ఆళ్లనాని అన్నారు. బాబు, పవన్‌లు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లాగా ఉన్న గోదావరి జిల్లాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ఓట్లను చీల్చాలనే లక్ష్యంతోనే పవన్ పని చేస్తున్నారని ఆళ్ల నాని ఆరోపించారు. పవన్ తన తీరు మార్చకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు.