Ys Jagan : మైలవరంలో తిరుపతికి సీటు... వైసీపీ వాళ్లకే అర్థం కాని జగన్ ఈక్వేషన్
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ సీటు విషయంలో చాలా స్పీడ్‌గా వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ సీటు విషయంలో చాలా స్పీడ్‌గా వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వసంత కృష్ణప్రసాద్ కొద్ది రోజులుగా పార్టీపై తన అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పదే పదే జోక్యం చేసుకుంటున్నారంటూ జగన్‌కు, పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం. 2014 ఎన్నికల్లో జోగి ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ పట్టు ఉండడంతో ఆయన అనుచరగణం ఎక్కువుగా ఉండడంతో ఇక్కడ వేళ్లు పెట్టి కెలకడం వసంతకు నచ్చలేదు.
వసంత ప్లేస్ లో...
అధిష్టానం సర్దిచెప్పినా పట్టించుకోని వసంత కృష్ణ ప్రసాద్ ఏలూరులో జరుగుతోన్న సిద్ధం సభకు హాజరు కాలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే విషయంపై తాను అంత ఆసక్తితో లేనని కూడా చెపుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. పైగా మైలవరంలో వసంత పేరుతో సర్వే కూడా జరుగుతోంది. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా వైసీపీ క్లారిటీకి వచ్చేసింది. దీంతో హుటాహుటీన మైలవరం నుంచి సిద్ధం సభకు కేడర్‌ను సమీకరణ చేసే బాధ్యతలను వైసీపీ ఎంపీ కేశినేని నానికి అప్పగించింది. పెద్ద లేట్ లేకుండానే ఆరో జాబితాలో మైలవరం జడ్పీటీసీ సర్నాకుల తిరుపతిరావు యాదవ్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేసింది.
జోగి వర్గీయుడుగా...
తిరుపతిరావు యాదవ్ మంత్రి జోగి రమేష్ వర్గంలో ఉంటున్నారు. మైలవరంలో తిరుపతి ఎంపిక, జగన్ ఈక్వేషన్ వైసీపీ వాళ్లనే కన్‌ఫ్యూజ్ చేస్తోంది. ఇక్కడ వసంతను మార్చాలనుకుంటే ఇదే సీటు అడుగుతున్న మంత్రి జోగి రమేష్‌కు ఇవ్వొచ్చు. పైగా మైలవరంలో గౌడ వర్గం ఓటర్లు చాలా ఎక్కువ. జోగికి యాదవ కమ్యూనిటీ ఎక్కువుగా ఉన్న పెనమలూరు ఇచ్చి, గౌడ వర్గం ఎక్కువుగా ఉన్న మైలవరంలో యాదవ కమ్యూనిటీకి చెందిన తిరుపతిరావు యాదవ్‌కు సీటు ఇవ్వడం తలపండిన రాజకీయ మేథావులను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
మళ్లీ మారుస్తారా?
జోగికి పెనమలూరులో పోటీ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా జగన్ మైలవరం సీటు ఇవ్వకపోవడంతో చివర్లో గతిలేక తన వర్గానికే చెందిన తిరుపతిరావు యాదవ్‌ను జోగి, ఎంపీ కేశినేని నాని స్వయంగా వెంటపెట్టుకుని జగన్ దగ్గరకు తీసుకువెళ్లి సీటు ఇప్పించారు. ఈ చిక్కుల లెక్కల్లో పెనమలూరులో జోగి రమేష్, మైలవరంలో తిరుపతిరావు యాదవ్ ఎలా గట్టెక్కుతారో ? లేదా నామినేషన్ల టైంలో అయినా మళ్లీ మార్పులు ఉంటాయా ? అన్నది కాలమే నిర్ణయించాలి.