మొన్న నేపాల్‌.. ఇప్పుడు శంషాబాద్‌.. రాహుల్‌కు షాకిచ్చిన మ‌రో వీడియో

కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు కూడా రాహుల్‌తో ఉన్న అమ్మాయి నిజంగానే చైనా అంబాసిడ‌ర్ అని కూడా న‌మ్మేశారు. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ

Update: 2022-05-07 11:15 GMT

ఇటీవ‌ల రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్ క్ల‌బ్‌లో కనిపించ‌డం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ వీడియోను వైర‌ల్ చేసి బీజేపీ వాళ్లు చాలా ర‌చ్చ చేశారు. రాహుల్ గాంధీతో ఉన్న అమ్మాయి చైనా అంబాసిడ‌ర్ అని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కాంగ్రెస్ సంక్షోభంలో ఉంటే రాహుల్ క్ల‌బ్‌ల‌కు వెళ్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కేవ‌లం 5 సెక‌న్ల ఈ వీడియోతో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఎంతోకొంత‌ న‌ష్టం జ‌రిగింది. కాంగ్రెస్ నేత‌ల‌కు కూడా ఈ వీడియోను ఎలా స‌మ‌ర్థించుకోవాలో అర్థం కాలేదు.

కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు కూడా రాహుల్‌తో ఉన్న అమ్మాయి నిజంగానే చైనా అంబాసిడ‌ర్ అని కూడా న‌మ్మేశారు. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చింది. త‌న స్నేహితురాలైన ఓ మాజీ జ‌ర్న‌లిస్టు వివాహానికి రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లార‌ని చెప్పింది. ఓ మీడియా సంస్థ.. రాహుల్‌లో క‌నిపించిన అమ్మాయి ఎవ‌ర‌నేది క‌నుక్కుంది. ఆ వీడియోలోని అమ్మాయి చైనా అంబాసిడ‌ర్ కాద‌ని, పెళ్లి కూతురు స్నేహితురాల‌ని తేల్చింది. ఇది రాహుల్ గాంధీకి కొంత రిలీఫ్ ఇచ్చినా కూడా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. నిజం గ‌డ‌ప దాట‌క ముందే అబ‌ద్ధం ఊరంతా తిరిగి వ‌స్తుంద‌నే మాట ఈ విష‌యంలో నిజ‌మైంది.
ఇక‌, వ‌రంగ‌ల్‌లో రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి కొంత చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. మ‌ళ్లీ ఒక వీడియో రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతోంది. ఇది కూడా ఐదు సెక‌న్ల‌కు మించ‌ని వీడియో. కానీ, జాతీయ మీడియా సంస్థ‌లు, బీజేపీ, టీఆర్ఎస్ నేత‌లు వైర‌ల్ చేస్తున్నారు. అస‌లేం జ‌రిగిందంటే... వ‌రంగ‌ల్ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు రాహుల్ గాంధీ విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు.
అక్క‌డి నుంచి వ‌రంగ‌ల్‌కు హెలీకాఫ్ట‌ర్‌లో బ‌య‌లుదేరడానికి ముందు ఎయిర్‌పోర్టు లాంజ్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏపీ కాంగ్రెస్ నేత హ‌ర్ష‌కుమార్ వంటి కొంద‌రు నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇదేమీ పెద్ద సీక్రెట్ మీటింగ్ కూడా కాదు. రాహుల్ గాంధీ వ‌చ్చి కూర్చోగానే... పీసీసీ నేత‌ల‌తో మాట్లాడారు. ఇవాళ మీటింగ్ ముఖ్య అంశం ఏంటి ? థీమ్ ఏంటి ? ఏ అంశం గురించి ప్ర‌ధానంగా మాట్లాడాలి ? అని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.
అంత‌లోనే వీడియోలు తీస్తున్నార‌ని గుర్తించిన రాహుల్ గాంధీ.. వారిని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని కోరారు. కానీ, అప్ప‌టికే రాహుల్ గాంధీ.. ప్ర‌శ్న‌లు అడుగుతున్న వీడియో రికార్డ్ అయిపోయింది. బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ వీడియోను బీజేపీ నేత‌, ఆ పార్టీ ఐటీ సెల్‌కు జాతీయ క‌న్వీన‌ర్ అయిన అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. నైట్ క్ల‌బ్‌ల‌కు, ఫారిన్ ట్రిప్‌ల‌కు తిరుగుతూ రాజ‌కీయాలు చేస్తే ఇలానే ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. అస‌లే బీజేపీ ఐటీ సెల్‌కు ఆయ‌న క‌న్వీన‌ర్. ఇంకేమందు బీజేపీ సోష‌ల్ మీడియా ఈ వీడియో దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ చేసింది.
జాతీయ మీడియా కూడా ఈ వీడియోను ప్ర‌ధానంగా ప్ర‌సారం చేస్తోంది. మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వీడియోను చూపిస్తూ రాహుల్ గాంధీకి అస‌లు ఏం మాట్లాడాలో కూడా తెలియ‌ద‌ని ఎద్దేవా చేస్తోంది. ఇక‌, వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ అమ‌లుకు రాహుల్ గాంధీ ఎలా బాధ్య‌త‌గా ఉంటార‌ని ప్ర‌శ్నిస్తోంది. మొత్తంగా ఒక వారం రోజుల్లోనే రెండు చిన్న చిన్న వీడియోలు రాహుల్ గాంధీని చిక్కుల్లో ప‌డేశాయి. ఏ జాతీయ స్థాయి నేత అయినా.. ఒక రాష్ట్రంలో స‌భ‌కు వ‌స్తే ప్ర‌ధానంగా ఏ అంశంపైన మాట్లాడాలో స్థానిక నేత‌ల అభిప్రాయం తీసుకుంటారు. ఇదేమీ పెద్ద విష‌యం కాదు. కానీ, ఇలా వీడియోలో క‌నిపించ‌డంతో రాహుల్ గాంధీకి ఏమీ తెలియ‌ద‌నే అభిప్రాయాలు క‌లిగే అవ‌కాశం అయితే ఉంది.


Tags:    

Similar News