Mopidevi : అంతకు మించి చేసేదేముంది... సర్దుకుపోవడం మినహా మరో దారి ఏది?
రేపల్లె నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చడం వైసీపీ అధినేత జగన్ కు అవసరం. మోపిదేవి వెంకట రమణ ఏంచేస్తారన్నది చర్చనీయం
రేపల్లె నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చడం వైసీపీ అధినేత జగన్ కు నిజంగానే అవసరం. గత రెండు ఎన్నికల్లో వరసగా ఓటమి పాలయిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు కొత్త వారిని ఎంపిక చేస్తే తప్పేంటన్న ప్రశ్న తలెత్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా మూడు సార్లు వరసగా ఓటమి పాలయిన వారికి టిక్కెట్ ఇవ్వబోమని మహానాడులో నారా లోకేశ్ బహిరంగంగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి అయినా గెలుపు ముఖ్యం. అంతే కానీ నమ్మకం.. అనుబంధం.. ఆప్యాయత.. అంటూ చూసుకుంటూ వెళితే పుట్టి మునుగుతుంది. రేపల్లె నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చినందున కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంటుందని జగన్ అంచనా అయి ఉండవచ్చు.
ఎవరి అడ్డా కాదు...
ఏ నియోజకవర్గమూ ఎవరి అడ్డా కాదు. అక్కడ ప్రజలు రెండు సార్లు ఓడించారంటే మోపిదేవి కుటుంబంపై ఉన్న వ్యతిరేకతను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అక్కడ సర్వేలు చేయించిన తర్వాతనే ఈసారి టిక్కెట్ మోపిదేవి కుటుంబానికి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొత్త ముఖం అయితే కొంత సానుకూల ఫలితం వెలువడే అవకాశముంటుంది. అక్కడ మత్స్యకార కుటుంబాలు ఎక్కువ. మోపిదేవికి పెద్దగా రాజకీయంగా నష్టం ఏమీ కలగదు. ఆయన పెత్తనమే నియోజకవర్గంలో నడుస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపిదేవిని 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఓటమి పాలయితే మంత్రిని కూడా చేశారు జగన్.
అన్ని పదవులు...
ఓటమి పాలయినా.. తనను నమ్ముకున్న వ్యక్తిని జగన్ మోసం చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీని చేసి మోపిదేవిని మంత్రిని చేసిన తర్వాత శాసనమండలి రద్దు ప్రతిపాదన వచ్చింది. అందుకోసమే వారిని మంత్రి పదవి నుంచి తప్పించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు. అంతటితో ఊరుకోలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. జగన్ తో తొలి నుంచి నడిచినందుకు ఆయనను ఏ రోజూ రాజకీయంగా తక్కువ చేసి చూడలేదన్నది వైసీపీ నేతల వాదనగా వినిపిస్తుంది. అందుకే మోపిదేవి కూడా కొత్తగా నియమితులైన గణేశ్ కు సహకరించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. మోపిదేవికి రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే జగన్ ఎక్కువ ఇచ్చారన్న వాదన కూడా వినిపిస్తుంది.
ఎదిరించినా....
ఇప్పుడు మోపిదేవి వెంకట రమణ పార్టీ హైకమాండ్ ను ఎదిరించి ఏమీ చేయలేరు. ఉన్నంతలో సర్దుకుబోవడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మర్యాద కాపాడుకోవాలంటే కొత్తగా ఎంపిక చేసిన వారికి సహకరించుకుండా మొండి కేస్తే అసలుకే ఎసరు వస్తుందన్నది వారి అనుచరుల నుంచి వినిపిస్తున్న టాక్. ఎందుకంటే మోపిదేవి ఇప్పుడు వైసీపీని కాదని వేరే పార్టీలోకి వెళ్లలేరు. వెళ్లినా అక్కడ ఇమడ లేరు. ఇక్కడ వచ్చినన్ని పదవులు రావంటే రావన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. మరి మోపిదేవి వెంకట రమణ అధినాయకత్వంతో అమితుమీకి సిద్ధమవుతారా? లేదా సర్దుకుపోతారా? అన్నది చూడాల్సి ఉంది.