వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ బిగ్‌ షాక్‌.. వారికి టికెట్లు కష్టమే!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్‌ నేతల కుమారులు, కుమార్తెలు సహా యువతకు 40 శాతం టిక్కెట్లు ఇవ్వాలని

Update: 2023-07-30 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్‌ నేతల కుమారులు, కుమార్తెలు సహా యువతకు 40 శాతం టిక్కెట్లు ఇవ్వాలని యోచిస్తున్నప్పటికీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల సమయం ఉన్నందున, ఈసారి పార్టీ టిక్కెట్లు తమ పిల్లలకు ఇవ్వాలని కోరుతూ పలువురు సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యమంత్రిని సంప్రదించినట్లు సమాచారం.

ఇలా ముఖ్యమంత్రి సీఎం జగన్‌ని సంప్రదించిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్‌ నాని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీన్వాస్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, యెమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు ఉన్నారు. తమ వారసులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్‌కు విన్నవించారు. అలాగే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు కూడా తమ పిల్లలకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద రావు, పినిపే విశ్వరూప్, తిప్పల నాగి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే, పార్టీలో వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించబోమని, సీనియర్లు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జగన్ వారికి తేల్చిచెప్పినట్లు సమాచారం. వీరిలో కొందరిని లోక్‌సభ ఎన్నికలకు బరిలోకి దింపినా, పార్టీ పనిలోకి దింపినా.. వారి పిల్లలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి జగన్ ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. "అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే, జగన్ అలాంటి రెండు లేదా మూడు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవచ్చు, అది కూడా యువకుల గెలుపు అవకాశాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే" అని వర్గాలు తెలిపాయి. మరీ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News