బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు.. ఆయన ప్రస్థానం ఇది !
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి..
తాడేపల్లి : బీసీ నేత ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకూ ఏ పార్టీలోనూ లేని ఆర్ కృష్ణయ్య పేరు లిస్ట్ లో కూడా లేదు. కానీ.. అనూహ్యంగా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడం విశేషం. ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపుతారన్న ఊహాగానాలు మొదలైన వెంటనే.. ఆయన తాడేపల్లికి రావడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా కీలకంగా వ్వహరిస్తున్నారు. గతంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ఆయన సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
1954 సెప్టెంబరు 13లో రాళ్లగుడుపల్లి గ్రామం, మోమిన్ పేట్ , వికారాబాద్ జిల్లాలో అడివప్ప గౌడ్, రాములమ్మ దంపతులకు జన్మించారు ఆర్ కృష్ణయ్య. ఎం.ఏ, ఎల్ఎల్ఎం., ఎంఫిల్ చదివారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. ప్రత్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పై 12, 525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య టిడిపి సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తదుపరి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆర్ కృష్ణయ్య మళ్లీ ఇప్పుడు.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
కాగా.. తనను వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆర్ కృష్ణయ్య సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించారు.