వార్‌కి వైసీపీ రెడీ.. మిషన్‌ మోడ్‌లో కార్యకర్తలు

'వై నాట్ 175' లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా, 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వచ్చే తొమ్మిది నెలల పాటు గెలుపు కోసం ముఖ్యమంత్రి

Update: 2023-07-17 11:00 GMT

'వై నాట్ 175' లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా, 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వచ్చే తొమ్మిది నెలల పాటు గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను మిషన్‌ మోడ్‌లో ఉంచారు. జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక, సమగ్ర సవరణ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం చురుగ్గా ఉండేలా చూడాలని శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులకు పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ (ప్రజా వ్యవహారాల) సలహాదారు సజ్జల రామకృష్ణ ఆదివారం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్‌ సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

‘వై నాట్ 175’ లక్ష్యం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సూచనలను గుర్తు చేశారు. ఓటర్ల జాబితా నవీకరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇందులో బోగస్ లేదా లేని పేర్లను తొలగించి అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చాలన్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయోజనకరమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వచ్చే తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పార్టీకి ప్రతి రోజూ కీలకం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీపై విషం చిమ్ముతున్నాయని, వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ద్వేషం, విషపూరిత ప్రచారాన్ని ప్రతిఘటించాలని వైసీపీ అధిష్ఠానం.. పార్టీ శ్రేణులకు సూచించింది.

రాష్ట్రంలో గందరగోళ వాతావరణం సృష్టించేలా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వైషమ్యాలు సృష్టిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో సొంతంగా టీమ్‌లు ఏర్పాటు చేసుకుని ఎదుర్కోవాలని పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులు అందుకు రెడీ అవుతున్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రతిపక్షాలు దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నాయని, ఈ విషయమై ప్రజలకు నిజం చెప్పాలని.. తమ పార్టీ కార్యకర్తలకు అధిష్ఠానం చెప్పిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, జేఎస్‌లు విషపూరిత ప్రచారం ద్వారా వాలంటీర్లపై విద్వేషపూరిత ప్రచారాన్ని పెంచారని, దీనికి ఘాటుగా బదులిచ్చేందుకు వైసీపీ యోచిస్తోంది. 

Tags:    

Similar News