‘మద్యం’ బారిన గులాబీ పార్టీ!

ఎంతటి బలవంతుడికైనా ఏదో ఓ చిన్న బలహీనత ఉంటుంది. కొన్ని సార్లు అదే వాళ్లని సమస్యల్లోకి నెడుతూ ఉంటుంది. కీలకమైన సమయాల్లో..

Update: 2023-07-10 05:53 GMT

ఎంతటి బలవంతుడికైనా ఏదో ఓ చిన్న బలహీనత ఉంటుంది. కొన్ని సార్లు అదే వాళ్లని సమస్యల్లోకి నెడుతూ ఉంటుంది. కీలకమైన సమయాల్లో వాళ్ల పోరాటానికి అడ్డం పడుతూ ఉంటుంది. భారత రాష్ట్ర సమితిగా మారిన తెరాస విషయంలోనూ అదే జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో స్వయానా పార్టీ అధ్యక్షుడి కూతురు కల్వకుంట్ల కవిత ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కోవడం ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేసింది.

ప్రతిపక్ష పార్టీల మీద సీబీఐని, ఈడీలను ఉసిగొల్పడంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. శరణు అన్న వాళ్లను, తన శిబిరంలో చేరిన వాళ్లను విడిచిపెట్టి, ప్రతిపక్ష నేతలను, తిరగబడ్డ వాళ్లను ‘చట్ట’ ప్రకారం బద్నాం చేయడం భాజపా మార్కు రాజకీయం. గతంలో కాంగ్రెస్‌ కూడా నిఘా సంస్థల్ని తన ప్రయోజనాల కోసం వాడుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసి జైలు పాలు కూడా అయ్యారు. ఈ విషయంలో భాజపా నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. ఏ ప్రతిపక్ష నాయకుడినీ వదలడం లేదు. ఉద్ధవ్‌ థాక్రే శిబిరంలోని సంజయ్‌ రౌత్‌ నుంచి, ఆప్‌ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వరకూ అందరికీ తన ‘పవర్‌’ చూపిస్తోంది.

తీగె లాగితే డొంకంతా కదిలినట్లు,. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాను అరెస్ట్‌ చేయగానే కవిత లైన్‌లోకి వచ్చారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్‌తో కవిత జరిపిన వాట్సప్‌ చాట్‌ అంశాలు భారాసను నైతికంగా ఇబ్బందుల్లోకి నెట్టాయి. విచారణ పేరుతో సీబీఐ కవితను మూడుసార్లు తన ఆఫీసుకు పిలిపించుకోవడంతో ఆమె అరెస్ట్‌ ఖాయమని మీడియా కూడా ప్రచారం చేసింది. భారాస, భాజపా మధ్య జరిగిన ‘రాజీ’కీయాల వల్ల ప్రస్తుతానికి కవిత ‘తప్పించుకున్నారు’

ఓ మహిళ అయి ఉండి లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోవడంతో ప్రతిపక్షాలు గులాబీపార్టీ మీద విరుచుకుపడ్డాయి. ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్ర అని కేసీయార్‌ టీం ఆరోపించినా, దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. భాజపా అధినాయకత్వాన్ని మచ్చిక చేసుకోవడానికి స్వయంగా మోదీ తనకు మిత్రుడని కేసీయార్‌ చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భాజపా, కాంగ్రెసేతర పక్షాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న కేసీయార్‌ ఆశలు కూడా అడియాసలుగా మారుతున్నాయి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఏ పార్టీ కూడా కలిసి రావడం లేదు. కర్నాటకలో జేడీయూ కూడా ఎన్డీయేలోకి వెళ్లిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా లిక్కర్‌ కుంభకోణం భారాస విస్తరణ వ్యూహాలకు కళ్లెం వేసినట్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News