Pawan Kalyan : పవన్ కోపం ఎవరిపైనా? కూటమిలో ఏం జరుగుతుంది?
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్‌లో చాలా రోజులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్‌లో చాలా రోజులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నికలకు ముందున్న పవన్ కల్యాణ్ నేడు కనిపించారు. ఆగ్రహంతో ఊగిపోయారు. సొంత పార్టీ నేతలని చూడకుండా.. కూటమిలో ఉన్నామని కూడా తెలయకుండా మాట్లాడారా? అంటే అనుకోలేం. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాటుదేలారు. దాదాపు పదేళ్ల పాటు ఆయన రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గామారాయి. పవన్ నిజంగా హోం మంత్రి అనితను నేరుగా అనాలని అనేశారా? లేక మరొకరిపై ఆగ్రహాన్ని అనితపై చూపించారా? అన్న చర్చ మాత్రం కూటమి పార్టీల్లో బయలుదేరింది.
సులువుగా తీసిపారేసేందుకు...
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సులువుగా తీసిపారేయలేం. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటే ఒకరకంగా చంద్రబాబు నాయకత్వాన్ని తప్పుపడినట్లే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై కూడా బాధ్యత వహిస్తారు. ఎందుకంటే హోంమంత్రిగా ఉన్న అనిత ఒక సాధారణ రాజకీయ నేత అని మాత్రమే తెలుసు. ఆమె పరిధి ఏమిటో? అనిత హోంమంత్రిత్వ శాఖను ఎంత వరకూ డీల్ చేస్తుందో పవన్ కు తెలియంది కాదు. కానీ పరోక్షంగా హోంమంత్రిత్వశాఖను పర్యవేక్షిస్తున్న వారికి తన కామెంట్స్ సూటిగా తగలాలనే పవన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుందని పలువురు విశ్లేషణలు చేస్తున్నారు.
అనిత, చంద్రబాబులను కాదు...
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అన్నా సాఫ్ట్ కార్నర్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి అని పవన్ గట్టిగా నమ్ముతారు. అనేక సార్లు బహిరంగంగానే చంద్రబాబును ప్రశంసించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు అనిత గురించి కాదు.. అలాగే చంద్రబాబు గురించి కూడా కాదనిచిన్న పిల్లవాడికైనా అర్థమవుతుంది. కానీ శాంతిభద్రలను వెనక నుంచి నడిపిస్తున్న ఒక నేతపైనే తన అక్కసును వెళ్లగక్కినట్లు రాజకీయాలు తెలిసిన వారికి ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. అందుకే పవన్ తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికను కూటమిలోని ప్రధాన పార్టీకి చెందిన ఒక నేతకు సూటిగా పంపగలిగారు.
ఇండివిడ్యువల్ గేమ్స్ ఆడవద్దంటూ...
అనితను అన్నందున వచ్చేదమీ లేదని పవన్ కు తెలియంది కాదు. ఈసారి చంద్రబాబు నాయుుడు జోక్యం కూడా లేదని పవన్ కు ఈ ఐదు నెలల పాలనలో అర్థమయింది. మరి ఎవరు? కానీ ఆ ఎవరు అన్నది అందరికీ తెలుసు. కేవలం జనసేన నేతలకే కాదు... అన్ని పార్టీల రాజకీయ నేతలకు పవన్ ఎవరిని గురించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది అందరికీ తెలిసిందే. ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఏపీలో పెరిగిపోయాయి. అయినా కొన్ని కేసులను కొందరి సిఫార్సులతో కేసు నమోదు చేయడం లేదని, క్రిమినల్స్ ను వదిలేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని, ఉత్తర్‌ప్రదేశ్ లో యోగి ఆదిత్యానాధ్ చేసినట్లు చేయాల్సి వస్తుందని, డీజీపీని కూడా ప్రశ్నించారంటే పవన్ ఏదో విషయంలో ఒకింత అసహనంగా మొదలయింది. అది పిఠాపురం నియోజకవర్గంలో బరస్ట్ అయినట్లు భావించాల్సి వస్తుంది. తన పదవి పోయినా పరవాలేదన్నారంటే లా అండ్ ఆర్డర్ పట్ల ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఇండివిడ్యువల్ గేమ్స్ ఆడవద్దంటూ చేసిన హెచ్చరిక ఎవరికి అన్నది ఇప్పుడు కూటమిపార్టీలో చర్చనీయాంశంగా మారింది.