చంద్రుడిపై సూర్యోదయం.. ఇస్రో గుడ్ న్యూస్ చెప్పేనా?
సూర్యుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్‌లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్, రోవర్ సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయి. దీంతో చంద్రుడిపై చీకటి నెలకొనడంతో ల్యాండర్, రోవర్ ను సెప్టెంబరు 3న ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపింది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రలోకి జారుకున్నాయి. అక్కడ ఒక్క రాత్రి భూమి మీద 14 రాత్రులతో సమానం. ఈ నెల 22వ తేదీన రాత్రి సమయం ముగియనుంది. ఇంకో 14 రోజుల పాటు పగటి సమయం ఉండనుంది. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ యాక్టివేషన్ గురించి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది.
సూర్యుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్‌లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించడం వల్ల బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అదే జరిగితే ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుంది. ల్యాండర్, రోవర్‌లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి కీలక సమాచారాన్ని భూమికి పంపింది. దక్షిణ ధృవం చీకటితో నిండిపోయే సమయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లోకి పంపించారు. దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. మైనస్ 180 నుంచి మైనస్ 230 డిగ్రీలు ఉంటుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి పని చేయగలదా లేదా అనేది తెలియాల్సి ఉంది. చంద్రుడిపై సూర్య కాంతి వస్తుండడంతో చంద్రయాన్-3 వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూడాల్సి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్ నాథ్ తెలిపారు. ఇప్పుడు చంద్రుడిపై సూర్యోదయం అయింది కాబట్టి, చంద్రయాన్-3 వ్యవస్థల్లో కదలిక వస్తే అవి శీతల వాతావరణాన్ని తట్టుకుని నిలబడినట్టు భావిస్తామని సోమ్ నాథ్ తెలిపారు.