KCR : కారంటే బోరు కొట్టిందా...? ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందా?

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం కేసీఆర్ అన్నది మాత్రం వాస్తవం

Update: 2023-12-03 13:10 GMT

కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్టు.. వ్యూహాలు రచించడంలో ఆయనను మించిన వారు లేరు. ఇవన్నీ ఎన్నికలకు ముందు వరకూ ఉన్న మాటలు. పోలింగ్ తేదీనైనా గ్రౌండ్ ను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్న సత్తా ఉందన్నది గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తల ధైర్యం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు ఎన్నికలు పెద్ద కష్టం కాదని వాళ్లు భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ నాయకత్వం లేమి కూడా తమకు కలసి వచ్చే అంశంగా కేసీఆర్ సయితం భావిస్తూ వచ్చారు. అంతే కాకుండా తనకు ఎదురు లేదనే ఆయన భావించారు. అందుకే ఆయన బీజేపీని పెంచడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాను మూడో సారి బయటపడతానని వేసుకున్న అంచనాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఆయనకు మూడోసారి ఓటమిని తెచ్చి పెట్టాయి. గెలిస్తే కేసీఆర్ అంతా తానేనంటూ ఎంతగా క్రెడిట్‌ను సొంతం చేసుకుంటారో...ఓటమిని కూడా ఆయన ఖాతాలో వేయాల్సిందే.

బాస్ అంచనాలన్నీ...
కాంగ్రెస్ గెలవడానికి అనేక కారణాలు.. ఎన్నో... కేసీఆర్ పార్టీ ఓటమి పాలు కావడానికి కూడా అన్నే రీజన్స్ ఉన్నాయి. కేసీఆర్ స్వయంకృతాపరాధమే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకుండా చేసిందనే చెప్పాలి. కేసీఆర్ తన బొమ్మను చూసి ఓటేస్తారనుకున్నారు. తెలంగాణ తెచ్చిన నేతగా తనకు తిరుగులేదనుకున్నారు. తనను తప్ప వేరే పార్టీని ఇక్కడ ఆదరించే అవకాశాలు లేవనే ఆయన గట్టిగా భావించారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమని భావించారు. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి ఉండదని అంచనా వేసుకున్నారు. కాంగ్రెస్ నేతల్లో అనైక్యత తనకు ప్రతి చోటా కలసి వస్తుందని ఆయన వేసుకున్న అంచనాలు పూర్తిగా పటాపంచలయ్యాయి.
భయపెట్టినా...
కేవలం సంక్షేమ పథకాలు తనను ఆదుకుంటాయని కూడా కేసీఆర్ ప్రిడిక్ట్ చేశారు. కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలు దక్కవనే ఆయన నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 96 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. కేసీఆర్ ప్రసంగాలను జనం పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చెబుతున్న మాటలను కూడా నమ్మలేదు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని, ధరణిని తీస్తే రైతుబంధు ఆగిపోతుందని భయపెట్టే చేసిన ప్రయత్నం కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే కేసీఆర్ కంటే ఈసారి కాంగ్రెస్ నే ఎక్కువగా నమ్మారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశమిచ్చి చూడాలని అనిపించి ఉండవచ్చు.
ఆ నలుగురేనా....?
కారు పార్టీ అంటే బోరు కొట్టి కూడా ఉండవచ్చు. గత పదేళ్ల నుంచి టీవీల్లో నలుగురే కనపడటం కూడా ఆ పార్టీకి నష్టం తెచ్చి పెట్టింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులు మాత్రమే హైలెట్ కావడం మిగిలిన వాళ్లు కేవలం బొమ్మలుగా మారడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. చూసే వాళ్లకు పక్కా ఫ్యామిలీ ఫంక్షన్ లా పదేళ్లను కేసీఆర్ నడిపారు. ప్రగతి భవన్ ను దాటి రాకపోవడం, ఎన్ని విపత్తులు జరిగినా ఆయన కాలు కదపకపోవడం కూడా ఓటమికి గల కారణాలుగా చూడాలి. అందుకే సెంటిమెంట్...ను తనంతట తానుగా దూరం చేసుకోవడమే కాకుండా... ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కేసీఆర్ ను చావుదెబ్బతీసిందని చెప్పాలి. చివరకు ఆయన బ్యాడ్ లక్.. కాళేశ్వరం ఎన్నికల సమయంలోనే కుంగిపోవడం కూడా ఓడిపోవడానికి కారణంగా చూడాలి.


Tags:    

Similar News