పవనూ.. జనం సరే.. క్యాడర్, క్యాస్ట్ మాటేంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్రను మరోసారి ప్రారంభించనున్నారు

Update: 2023-09-30 06:45 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి యాత్రను మరోసారి ప్రారంభించనున్నారు. అయితే గతంలో యాత్రకు, రేపటి నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చాలా తేడా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని అధికారిక ప్రకటన చేసిన తర్వాత తొలిసారి పవన్ జనంలోకి వస్తున్నారు. ఆయన ఏం చెబుతారన్న ఆసక్తి సహజంగానే నెలకొని ఉంటుంది. జనాన్ని కన్విన్స్ చేయడం వరకూ ఓకే. ఎందుకంటే వారు అడగలేరు. మనసులో ఏమున్నా అది బయటకు చెప్పలేరు. కేవలం ఎన్నికల సమయంలోనే తమ తీర్పు ద్వారా వారు వెల్లడిస్తారు.

షరతులు లేకుండా...
కానీ క్యాడర్, క్యాస్ట్ అలా కాదు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు పవన్ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం తెలుపుతూ తమ కామెంట్లను పెడుతున్నారు. బేషరతుగా టీడీపీతో పొత్తు ఉందని ప్రకటించడం పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంది. సీట్లు, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఫిఫ్టీ... ఫిఫ్టీ అంటూ డిమాండ్ చేయకుండా పవన్ తప్పు చేశాడన్నది కిందిస్థాయి క్యాడర్ మనోగతంగా ఉంది.
అవసరాన్ని...
టీడీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. సానుభూతి వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే జనసేన అవసరం ఇప్పుడు టీడీపీకి ఉంది. ఆ అవసరాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకోవడంలో పవన్ కల్యాణ్ అట్టర్ ప్లాప్ అయ్యారంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా పొత్తును ప్రకటించిన పవన్ క్యాడర్ కు సర్ది చెప్పాలని చూసినా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే పదేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత లీడర్ పై ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయ.
క్యాస్ట్ నుంచి కూడా...
ఇక క్యాడర్ ను పక్కన పెడితే... క్యాస్ట్ నుంచి కూడా పవన్ కల్యాణ్ కు సానుకూలత కనిపించడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ తప్పు చేశాడని చెబుతున్నారు. బహిరంగంగానే పవన్ పై కాపు నేతలు విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబును నమ్మి పొత్తు పెట్టుకుంటే మోసపోయేది పవన్ మాత్రమే కాదని కులం కూడా అని వారు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తుండటంతో కులం కూడా పవన్ వెంట నడిచే అవకాశాలు కన్పించడం లేదు. మరి ఇటు క్యాస్ట్ ను, అటు క్యాడర్ ను తన వైపునకు తిప్పుకునేందుకు పవన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News