రూట్ మ్యాప్ ఇచ్చింది పవనే
జనసేన అధిపతి ఢిల్లీ బయలుదేరి వెళ్లి బీజేపీ నేతలను కలుస్తామన్నారు. వారితో తన రాజమండ్రి డిక్లరేషన్ గురించి చెబుతామన్నారు
జనసేన అధిపతి ఢిల్లీ బయలుదేరి వెళ్లి బీజేపీ నేతలను కలుస్తామన్నారు. వారితో తన రాజమండ్రి డిక్లరేషన్ గురించి చెబుతామన్నారు. అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలసి వివరించి బీజేపీని కూడా తమతో కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఢిల్లీ ఎప్పుడు అన్నదే చెప్పలేదు. వారిద్దరి అపాయింట్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అసలు బీజేపీతో మిత్రపక్షంగా ఉండి దానితో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా పొత్తును అధికారికంగా ప్రకటించిన తర్వాత వెళ్లి చెప్పడంలోనే పవన్ వ్యూహముందని అంటున్నారు.
రూట్ మ్యాప్ తానే ఇచ్చి…
ఇన్నాళ్లూ బీజేపీ తనకు రూట్ మ్యాప్ ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఇప్పుడు కమలం పార్టీకే జనసేనాని రూట్ మ్యాప్ ఇచ్చినట్లయింది. తాను ఈ మార్గంలో వెళుతున్నానని అవసరమైతే కలసి రాావాలని కోరనున్నారు. అందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు అంగీకరిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే రోడ్ మ్యాప్ మాత్రం పవన్ నిర్ణయించారన్నది వాస్తవం. ఏపీలో బీజేపీకి బలం లేదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ ఒక్క కారణంతోనే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీకి ఆ మాత్రం గౌరవమైనా ఇస్తున్నాయి.
బీజేపీకి రెండు మార్గాలు…
అయితే ఇప్పుడు పవన్ బీజేపీకి పెద్ద పరీక్ష పెట్టారు. తాను టీడీపీతో పొత్తును ప్రకటించిన తర్వాత ఇక వెనుదిరిగి పోయే అవకాశం ఉండదు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వలేదు. గోల్ తాను చేయాలని నిర్ణయించుకున్న పవన్ బీజేపీని దరిదాపుల్లోకి రాకుండా చేయగలిగారు. ఇప్పుడు బీజేపీ ముందున్న మార్గం పొత్తుకు అంగీకరించి ఎంపీ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా పనిచేయడం ఒకటి. రెండోది చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేకపోతే ఒంటరిగా పోటీ చేసి తిరిగి నోటాతో పోటీ పడటం. ఈ రెండింటిలో తేల్చుకోవాల్సింది బీజేపీ పెద్దలే కావడం విశేషం.
నష్టం కమలానికేగా…
పవన్ కల్యాణ్ కూడా గౌరవంగా ఢిల్లీకి వెళ్లి పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తారు. వాళ్లు ఇస్తే విషయం చెబుతారు. లేదంటే తనను పార్టీ పెద్దలు కలవడానికి ఇష్టపడటం లేదని వెనక్కు తిరిగి వస్తారు. ఏం జరిగినా అది బీజేపీకే నష్టం. అందుకే పవన్ ముందుగానే పొత్తు ప్రకటించి అనంతరం హస్తినకు వెళ్లి చెప్పాలనుకున్నారు. ఆయన వ్యూహం అదే. బీజేపీ కలసి వచ్చినా, రాకపోయినా ఒరిగేదేమీ ఉండదు. కాకుంటే ఎలక్షనీరింగ్‌లో కొంత ఇబ్బందులు ఎదురవ్వడం తప్ప విజయం తమదేనన్న ధీమాలో జనసేన, టీడపీలు ఉన్నాయన్నడంలో ఎంతమాత్రం సందేహం లేదు.