రేవంత్ వర్గానికి షాక్.. సీనియర్లపై కామెంట్స్‌తో సీన్ రివర్స్.!

సీనియర్లపై ఢిల్లీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతకు ఊహించని షాక్ తగిలింది. నోటీసులిచ్చేందుకు కమిటీ నిర్ణయించింది.

Update: 2022-05-02 13:05 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం మొదలైంది. ఇప్పుడిప్పుడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇతర సీనియర్ నేతల మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నాయని అనుకునేలోపే మరో దుమారం రేగింది. రేవంత్ వర్గానికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నల్గొండ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేతకు షాకిచ్చేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది. రేవంత్ వర్గంలో కీలక నేతగా ఉన్న అద్దంకి దయాకర్‌కి షోకాజ్ నోటీసులివ్వాలని పార్టీ నిర్ణయించింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో హేమాహేమీలైన ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై దయాకర్ చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ తప్పుబట్టింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని.. తుంగతుర్తిలో తన ఓటమికి అప్పుడు కారణమయ్యారంటూ సీనియర్ నేతలపై దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పార్టీకి నష్టం చేస్తున్న సీనియర్ నేతలు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నేరుగా అధినేత్రి సోనియా, అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్‌కి సన్నిహితుడిగా పేరున్న దయాకర్.. ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ నేతలను తూర్పారబట్టారు. ఇప్పుడదే రివర్స్ కొట్టింది. ఫిర్యాదు చేయడం వరకూ బాగానే ఉన్నా మీడియాకెక్కడాన్ని క్రమశిక్షణ కమిటీ తప్పుబడుతోంది. పార్టీలో సీనియర్ నేతలపై బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అద్దంకి దయాకర్‌కి షోకాజ్ నోటీసులివ్వాలని నిర్ణయించింది.

ఇటీవల నల్గొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం కూడా హీట్ రాజేసింది. నల్గొండ వ్యవహారాలు ఉత్తమ్, జానా రెడ్డితో కలిసి చూసుకుంటామని.. జిల్లాకు బయటి నుంచి వ్యక్తులు రావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నల్గొండలో పార్టీ బలంగా ఉందని.. బలంగా లేని జిల్లాల్లో రేవంత్ సన్నాహక సమావేశాలు పెడితే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే ఆ వ్యవహారాన్ని అద్దంకి దయాకర్ తీవ్రంగా తప్పుబట్టారు.

కనీసం జిల్లా కాంగ్రెస్ నేతలను సంప్రదించకుండా కోమటిరెడ్డి అలా ఎలా మాట్లాడతారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలోని అసమ్మతి నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మరీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీలో మండల, జిల్లా స్థాయి నేతలకు కనీస గుర్తింపు లేకుండా పోతోందని.. ఈ ధోరణిని సహించేది లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో రేవంత్ సన్నాహక సమావేశం విజయవంతం చేస్తామని సంకేతాలిచ్చారు. రాహుల్ సభ నేపథ్యంలో రేవంత్ వర్గం కోమటిరెడ్డిని టార్గెట్ చేసుకుని ఇరకాటంలోకి నెట్టేందుకు యత్నించిందనే వాదనలున్నాయి.

ఈ పరిణామంతో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందనేది మరోమారు తేలిపోయింది. అదే సమయంలో రేవంత్ వర్గానికి చెందిన కీలక నేతకి నోటీసులిచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించడం మరింత హీట్ రాజేస్తోంది. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేతకే షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవడం రేవంత్ వర్గానికి మింగుడుపడని విషయమే. సీనియర్లను ఎదిరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మరోమారు స్పష్టంగా చెప్పినట్టైంది.

నిజానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా సీనియర్ల నుంచి సహకారం అంతంతమాత్రమే. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమను కాదని.. వలసొచ్చిన నేతకు పీసీసీ పదవి కట్టబెట్టడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానంపై నిప్పులు చెరిగారు. డబ్బు సంచులు తీసుకుని పదవి ఇప్పించారంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. మొదటి నుంచీ ఆయన రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో సీనియర్, మాజీ చీఫ్ ఉత్తమ్ కూడా రేవంత్ నియామకం తర్వాత అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు రేవంత్ వర్గం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నా పార్టీలో వారి చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌లో నల్గొండ నేతలను ఢీకొట్టడం అంత ఆషామాఫీ వ్యవహారం కాదనే సంగతి మరోమారు రుజువైంది.

Tags:    

Similar News