Andhra Pradesh : ఫ్రీ బస్సు పై ఏపీ సర్కార్ పునరాలోచనలో పడిందా?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.;

Update: 2024-11-01 08:37 GMT
free bus travel,  women in Ap,  free bus reconsidering in ap, andhra pradesh  free bus travel for women, latest updates on free bus in ap

 free bus reconsidering in ap

  • whatsapp icon

ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఏ మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఎన్నికల హామీని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెప్పారు కానీ, తర్వాత ఆ పథకం అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు అందులో లోటుపాట్లను కూడా చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.

ప్రయోజనం కంటే...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనంలో వెల్లడయిందని తెలిసింది. అందువల్లనే ఈ పథకం అమలు చేయకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నట్లు పార్టీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆటో డ్రైవర్ల నుంచి నిరసనలు వస్తాయని భావించడంతో పాటు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తే నగుబాటుకు గురవుతామని ఆయన పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కొత్త ఆర్టీసీ బస్సులను కొనలేని స్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో కూడా సిటీ బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది.
సీట్లు దొరకక...
ఇప్పటికే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంతో పురుషుల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వారికి ఆర్టీసీ బస్సుల్లో చోటు కూడా దక్కడం లేదు. మహిళలు ఉచితం కావడంతో రాష్ట్రమంతటా ప్రయాణిస్తుండటంతో పురుషులు సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. నెలకు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అదనపు బస్సులు కొనుగోలు చేసినా ఫలితం ఉండటం లేదు. పురుషులు ఆర్డినరీ సర్వీసుల్లో వెళ్లడం మానుకుని ఇక ఉచితం లేని బస్సుల్లో మాత్రమే కొంత అదనంగా డబ్బు చెల్లించి ప్రయాణం చేయాల్సి వస్తుంది.
కర్ణాటకలో పునరాలోచన...
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోనూ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినప్పటికీ ఖజానాకు భారంగా మారిందని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అంతా సెట్ అయిన తర్వాత, ఖజానా కొంత కుదురుపడిన తర్వాత ఈ పథకం గ్రౌండ్ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం. అప్పటి వరకూ హోల్డాన్ లో ఈ ప్రతిపాదనను పెట్టారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. సో.. ఏపీ మహిళలకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.


Tags:    

Similar News