నెహ్రూ అనుభవం..మోడీకి పాఠం

భారత చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు దేశంలో రాజకీయ వాతావరణాన్నివేడెక్కిస్తున్నాయి. పొరుగుదేశంతో భారత వ్యవహారశైలిని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ తొలి నుంచీ [more]

Update: 2020-06-23 16:30 GMT

భారత చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు దేశంలో రాజకీయ వాతావరణాన్నివేడెక్కిస్తున్నాయి. పొరుగుదేశంతో భారత వ్యవహారశైలిని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ తొలి నుంచీ ప్రశ్నిస్తున్నారు. తాజాగా పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ సైతం రంగ ప్రవేశం చేయడంతో కాక పెరిగింది. చైనాతో అతి సాన్నిహిత్యం నెరపిన ప్రధాని నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? చైనా తీరును అంచనా వేయడంలో వైఫల్యం చెందారా? ఇప్పటికైనా పరిస్థితులపై సమగ్ర అవగాహనతో భారత్ ను నడిపేందుకు సిద్దమవుతున్నారా? వంటి అనేక ప్రశ్నలకు మన్మోహన్ వ్యాఖ్యలు తావిచ్చాయి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను వదులుకునేందుకు రాజకీయాధికారంలో ఎవరు ఉన్నప్పటికీ ఇష్టపడరు. అందులో రెండోమాటకు తావు లేదు. అయితే దౌత్య వ్యవహారాలను వ్యక్తిగత సంబంధాలతో బలోపేతం చేయాలని ప్రయత్నించిన ప్రధాని మోడీని చైనా దారుణమైన దెబ్బ తీసిందనే చెప్పాలి. నరేంద్ర మోడీ గతంలో ఏ భారత ప్రధాని జరపని స్థాయిలో అత్యధిక సంఖ్యలో చైనా పర్యటనలు చేశారు. ఆ దేశాధ్యక్షునితో రికార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. అయినా ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. 45 సంవత్సరాల తర్వాత భారత సైనికులు పదుల సంఖ్యలో చనిపోయారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగానే చెప్పాలి.

అంతా ఒకటై…

‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటూ భారతదేశాన్ని గురించి మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రాంత, భాషా భేదాలెన్ని ఉన్నప్పటికీ కలిసి నడుస్తామనే ఉద్దేశంతోనే ఆ భావనను వ్యక్తం చేస్తుంటాం. తాజాగా చైనా విషయంలోనూ అఖిలపక్ష భేటీలో రాజకీయ పార్టీలు దాదాపు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. కాంగ్రెసు వంటి పార్టీలు తమకుండే రాజకీయ ప్రత్యేకతను నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలనే సూచించాయి. గతంలో 1950 వ దశకంలో హిందీ – చీనీ భాయి భాయి అనే నినాదంతో పంచశీల సూత్రాన్ని ప్రతిపాదించి నెహ్రూ దెబ్బతిన్నారు. అత్యంత సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకోవాలనే ప్రయత్నంలో ఆయన భంగపడ్డారు. ఇప్పటికీ నెహ్రూ చైనా విధానంపై విమర్శలు వినవస్తూ ఉంటాయి. కాంగ్రెసు పార్టీ సైతం ఆ అపఖ్యాతిని భరించాల్సి వస్తోంది. అదే విధంగా చైనాతో సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించకుండా రాసుకుపూసుకు తిరగడంతో నెహ్రూ తరహా లోనే అవమానాన్ని ఇప్పుడు మోడీ దిగమింగుకోవాల్సి వస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమానం..అప్రమత్తం…

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల విమర్శలకు తావిచ్చాయి. చైనా మన భూభాగంలోకి రాలేదు. సరిహద్దు ఎక్కడా ఆక్రమణకు గురికాలేదన్న రీతిలో ప్రధాని స్పందించడంపైనే కాంగ్రెసు గురి పెట్టింది. 1959లో చైనాతో చోటు చేసుకున్న సరిహద్దు ఘర్షణలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. దానిని అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. దాంతో 1962లో చైనా చెలరేగి భారత్ సరిహద్దుల్లో పలుప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధంలో భారత్ వెనకంజ వేయాల్సి వచ్చింది. ప్రపంచ స్థాయి దౌత్యంలో అప్పటికి భారత్ చైనా కంటే చాలా కీలక స్థానంలో ఉంది. అయినప్పటికీ చైనాకు ఆధిక్యం లభించింది. గడ్డిపోచ కూడా మొలవని ప్రాంతాలను చైనా ఆక్రమించిందనే తీరులో తేలికగా తీసిపారేస్తూ నెహ్రూ ఆ సందర్బాన్ని వ్యాఖ్యానించినట్లు చెబుతారు. దురాక్రమణను చిన్నదిగా చూపే ప్రయత్నమది. ఇప్పుడు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సైతం అలాగే ఉన్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. 1950-60 లలో మాదిరి గా భారత్, చైనాలు ఇప్పుడు కేవలం ఆసియాకు పరిమితమైన ప్రాంతీయ శక్తులు కాదు. ప్రపంచంలో అగ్రశ్రేణి సైనిక, ఆర్థిక సామర్ధ్యం కలిగిన తొలి అయిదు దేశాల్లో ఉన్నాయి. ఈరెండూ తలపడే పరిస్థితులే ఉత్పన్నమైతే ప్రపంచయుద్దానికే దారితీస్తుందనే వారూ ఉన్నారు. అందువల్ల పొరుగుదేశమైన చైనా పట్ల అనుమానాస్పద దృక్పథంతో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.

పిలుపు…మలుపు

రాజకీయాల సంగతి పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వాదనలో కొంత హేతుబద్ధత ఉంది. చైనా దురాక్రమణకు పాల్పడటం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెబితే ప్రపంచదేశాలకు, దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనేది వాస్తవం. అదే జరిగితే 20 మంది సైనికులు మరణించేంతటి తీవ్ర పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయనే ప్రశ్న తలెత్తుతుంది. అందువల్ల సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితులపై దేశ ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుద్ధ వ్యూహాలు, రక్షణ చర్యలపై విడమరిచి వివరించాల్సిన అవసరం లేదు. అది దేశ రక్షణ విషయంలో సార్వభౌమాధికారం కలిగిన కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కమ్యూనిస్టు నియంతృత్వంలో ఉండే చైనా తన దేశ ప్రజలకు, ప్రపంచానికి పెద్దగా బాధ్యత వహించదు. ప్రజాస్వామ్యదేశమైన భారత్ విషయం అలా కాదు. ప్రతి పౌరునికీ నిలదీసే అధికారం ఉంటుంది. అందువల్ల విదేశీ వ్యవహారాలు, రక్షణ విషయంలో అధినేతలు మరింత జాగరూకతతో ఉండాలి. గతం నుంచి గుణపాఠాలను స్వీకరించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News