ఎందుకింత సాహసం.. గెలవడానికేనా?

వైఎస్ జగన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎత్తుగడల విష‍యంలో పెద్ద అనుభవాన్నే సంపాదించారు

Update: 2023-10-06 06:54 GMT

వైఎస్ జగన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎత్తుగడల విష‍యంలో పెద్ద అనుభవాన్నే సంపాదించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఆయన అనుకూల వర్గాన్ని నాలుగేళ్ల నుంచి దడదడలాడిస్తున్నారంటే ఆషామాషీ కాదు. జగన్ డిక్షనరీలోనే రాజీ లేదంటారు. రాజీ పడకుండా రాజకీయాలు చేయడం కూడా సాహసమే. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి తన గేమ్ ఏంటో అర్థం కాకుండా చేయగలిగారు. సానుభూతి వస్తుందన్న ఆలోచన కూడా జగన్ చేయలేదు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ పెద్దగా ప్రభావం చూపదన్న ధైర్యమే ఆయన ఆట ప్రారంభించడానికి కారణమనే వారు లేకపోలేదు. పొలిటికల్ గేమ్ ను ఇప్పటికే ప్రారంభించారు. గేమ్‌లో గెలుపు తనవైపే ఉండాలన్నది జగన్ కాంక్ష. ప్రత్యర్థులకు ఏమాత్రం అందకుండా ఉండాలన్న జగన్ వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందన్నది చూడాలి.

మ్యానిఫేస్టోను కూడా...
అందుకే ఈసారి మ్యానిఫేస్టోను కూడా పకడ్బందీగా రూపొందించే పనిని ఒక టీంకు అప్పగించారని తెలిసింది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను రూపొందిస్తున్నారు. మూడు పేజీలకు మించకుండా మ్యానిఫేస్టోను రూపొందించి జనంలోకి సులువుగా వెళ్లగలిగే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా ఈసారి రైతు రుణమాఫీని జగన్ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలకు కూడా జగన్ శ్రీకారం చుట్టనున్నారు. మ్యానిఫేస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తారన్న పేరు రావడంతో పకడ్బందీగా ఇప్పటి వరకూ తనపైన, ప్రభుత్వంపైన అసంతృప్తిగా ఉన్న వర్గాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
అవినాష్ ను కూడా...
మరోవైపు ఈసారి కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించారని తెలిసింది. అవినాష్ రెడ్డి స్థానంలో మైనారిటీ వర్గం నేతకు ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే చాలా కాలం తర్వాత కడప ఎంపీ పదవి వైఎస్ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులకు ఇచ్చినట్లవుతుంది. 1989 నుంచి 2019 వరకూ అంటే మూడున్నర దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబీకులే కడప ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు.
వారికే ఈసారి...
కానీ ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టాలన్న యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. అలాగే బాలినేని వంటి వారికి కూడా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశాలు లేవన్న సమాచారం అందుతుంది. కుటుంబం కాకుండా ఇతర వర్గాలకు పెద్దపీట వేసేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నది విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే తొలుత తన కుటుంబీకులు, బంధువులను ఒప్పించి వారి స్థానంలో బలహీన, మైనారిటీలకు స్థానం కల్పించడమే జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. బీసీ ఓట్లను సాలిడ్ గా సొంతం చేసుకునేందుకు జగన్ చేసే ప్రయోగం ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది. అందుకే జగన్ గేమ్ ప్రత్యర్థులకు సయితం అర్థం కావడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Tags:    

Similar News