Ys Sharmila : నిజంగా అదే షర్మిల నిర్ణయమయితే.. ఇబ్బందులు ఎవరికి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ షర్మిల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

Update: 2023-12-27 06:31 GMT

ys sharmila

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ షర్మిల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి ఇక్కడకే పరిమితమవుతారని భావించారు. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చనివ్వకూడదని, కాంగ్రెస్ విజయానికి ఆటంకం కాకూడదని తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించారు. అంతకు ముందు తన సోదరుడు జగన్ కు బద్ధ శత్రువైన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలసి తన పంథా ఏంటో చెప్పకనే ఆమె బయటకు చెప్పారు.

పార్టీలో నేరుగా...
కానీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదు. పాలేరులోనూ ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయినట్లే. అధికారికంగా కాకపోయినా.. అనధికారికంగా హస్తం పార్టీ గూటికి షర్మిలమ్మ వెళ్లిపోయినట్లే భావించాలి. అయితే తెలంగాణ ఎన్నికలు కాబట్టి వైఎస్ షర్మిలను ఎవరూ పట్టించుకోలేదు. ఆమె ఇక్కడ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అంచనాలే అందుకు కారణం కావచ్చు. వైఎస్ అభిమానులు కూడా ఇప్పటికే అనేక పార్టీల్లో చేరిపోవడంతో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా బలంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకోవడంతో షర్మిలకు కొంత తెలంగాణలో మైనస్ అయిందనే విశ్లేషకులు సయితం అంచనా వేశారు. అందుకే షర్మిల చివరి నిమిషంలో తెలివిగా ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు జై కొట్టారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో...
అయితే అయిందేదో.. అయింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆమెను కాంగ్రెస్ నేతలు కలవడం కానీ, షర్మిల వెళ్లి కాంగ్రెస్ నేతలకు నేరుగా అభినందనలు తెలపడం కానీ జరగలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి వైఎస్ షర్మిల పేరు నానుతోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అదీ కాకుంటే షర్మిలను వచ్చే ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించవచ్చనే ఊహాగానాలు వినపడుతున్నాయి. అందులో వాస్తవమెంతో తెలియదు ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఏపీ సీనియర్ నేతలతో జరుపుతున్న సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని కూడా గతంలో ప్రచారం జరిగింది. అందులో వాస్తవం మాత్రం ఎంత ఉందో తెలియరాలేదు. తాజాగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ కానుకలు పంపడం వైసీపీ సోషల్ మీడియాలో పార్టీ అభిమానులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు.
ఆదరిస్తారా?
కానీ తన సోదరుడు జగన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ కు అనుకూలంగా ప్రచారాన్ని నిర్వహించారు. బైబై బాబూ అంటూ నినాదాలు చేస్తూ షర్మిల చేసిన ప్రసంగాలు అప్పట్లో పేలాయనే చెప్పాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల ప్రచారానికి వెళితే జగన్ కు సానుభూతి మరింత పెరిగే అవకాశముంది. జగన్ ప్రత్యర్థులందరూ కుటుంబ సభ్యులను కూడా తమ వైపునకు తిప్పుకుని దాడి చేస్తున్నారని ఆయన చెప్పే అవకాశముంది. అదే సమయంలో జగన్ ను కాదని అక్కడ రెడ్డి సామాజికవర్గం కానీ, మరో క్యాస్ట్ కానీ షర్మిల ప్రచారం చూసి ఓటు వేసే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే అక్కడ మొత్తం ఓటు బ్యాంకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. పైగా కాంగ్రెస్ కు అక్కడ క్యాడరే లేదు. లీడర్లున్నా.. పెద్దగా వర్క్ అవుట్ కాదు. ఈ పరిస్థితుల్లో మరోసారి షర్మిల ఏపీలో కాలుపెట్టి చేయి కాల్చుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరి షర్మిలతో పాటు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News