YSRCP : డాక్టర్ బాబుకి పార్లమెంటు సీటు.. జగన్ వ్యూహం అదేనా?
రాజమండ్రి పార్లమెంటు సీటు గూడూరి శ్రీనివాస్ కు ఇచ్చి వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేశారు
YS Jagan, guduri srinivas seat:ఆయనో డాక్టర్.. గత నలభై ఏళ్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాంటి డాక్టర్‌కు జగన్ నుంచి పిలుపు వచ్చింది. మీకు ఎమ్మెల్యే సీటు ఇస్తున్నాం.. పోటీకి రెడీగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్యయకర్తగా కూడా నియమించారు. ఐదారు నెలలు ఆయన నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసుకున్నారు. పోటీకి రెడీ అవుతున్నారు. వెంటనే మళ్లీ మార్పులు, చేర్పుల్లో ఆయన సమన్వయకర్త పదవి నుంచి తొలగించి పార్లమెంటు ఇన్ ఛార్జి పదవిని అప్పగించారు. తాజాగా ఆరో లిస్టులో ఆయనకు ఏకంగా పార్లమెంటు టిక్కెట్ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ ఇన్‌ఛార్జిగా గూడూరి శ్రీనివాస్ ను ఎంపిక చేశారు.
పల్మనాలజిస్టుగా...
ఉభయతూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ గా గూడూరి శ్రీనివాస్ కు మంచి పేరుంది. పల్మనాలజిస్టుగా ఆయన అందరికీ సుపరిచితులు. పేద, మధ్య, ధనిక ఇలా తేడా లేకుండా డబ్బుల కోసమే కాకుండా ప్రజా సేవ కోసమే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. అయితే తొలుత రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించి ఆ తర్వాత ఆయనను తప్పించి మార్గాని భరత్ కు అప్పగించారు. ప్రస్తుతం డాక్టర్ ను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిని చేశారు. పార్లమెంటు సీటు సమన్వయకర్తగా శెట్టిబలిజ వర్గానికే చెందిన డాక్టర్ అనసూరి పద్మలత పేరు ఖరారు చేశారు. గూడూరి శ్రీనివాస్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఇక తాజాగా ఆరో లిస్టులో మార్పుల్లో పద్మలతకు షాక్ ఇచ్చి.. ఆమెను పక్కన పెట్టేసి మళ్లీ గూడూరు శ్రీనివాస్‌ను తీసుకువచ్చి రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త పగ్గాలు ఇచ్చారు.
వారం రోజులకే మార్చి...
దీంతో రాజమండ్రి ఎంపీ సీటు నాదే అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు, సంబరాలు చేసుకున్న పద్మలత ఆనందం వారం రోజులు కూడా లేదు. జగన్ గత ఎన్నికల్లోనే రాజమండ్రి సీటును బీసీల్లో బలమైన గౌడ వర్గానికి ఇచ్చారు. ఆ వర్గం నుంచి మార్గాని భరత్ పోటీ చేసి గెలిచారు.ఇక ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన శెట్టిబలిజ కమ్యూనిటీకే ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఆ వర్గానికే ఇచ్చారు. ఈ మార్పు వెనక సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చక్రం తిప్పారని తెలుస్తోంది. తనకోసం రాజమండ్రి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌కు పార్లమెంటు సీటు ఇప్పించారని టాక్ ? విచిత్రం ఏంటంటే రాజమండ్రి సిటీ, రూరల్, పార్లమెంటు ఈ మూడు సీట్లను వైసీపీ గౌడ, గౌడ ఉపకులాలకు చెందిన వారికే కేటాయించింది. రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీకి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.