Australia Vs India : ఎందుకయ్యా.. అక్కడకు వెళ్లింది.. గోళీలు ఆడుకోవడానికా? మానేయరాదూ...?

భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియాతో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో పూర్తిగా విఫలమవుతున్నారు.

Update: 2024-12-30 03:52 GMT




 


సీనియర్ ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియాతో ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో పూర్తిగా విఫలమవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఇలా ఎందుకు వచ్చి ఆడుతున్నారో కూడా తెలియడం లేదు. ఇప్పటి వరకూ నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగ్గా తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నారు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. రెండో మ్యాచ్ నుంచి వచ్చినప్పటికీ రోహిత్ శర్మ పెద్దగా పొడిచింది లేదు. అలా రావడం ఇలా వెళ్లిపోవడం. అలవాటయిన మైదానాలు అయినప్పటికీ తడబాడు పటి భారత్ కు ఇబ్బంది తెచ్చిపెడుతున్నారు. పెద్దగా పరుగులు చేయకుండానే సీనియర్ ఆటగాళ్లందరూ అవుట్ అవుతుండటం బీసీసీఐ పునరాలోచనలో పడాల్సిన అవసరం ఉందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.బౌలర్లు అనుకూలంగా మ్యాచ్ ను మలిచినా విజయాన్ని అందుకోలేక అవస్థలు పడుతున్నారు.

వరస వైఫల్యాలతో...
రోహిత్ శర్మ కెప్టెన్ గా ఇన్నింగ్స్ ఆడి ఎన్ని రోజులయిందో చెప్పాలంటూ నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆడేదానికి అక్కడదాకా వెళ్లి ఎందుకు అభాసుపాలు చేయడం అంటూ నిలదీస్తున్నారు. ఇక విరాట్ కోహ్లి కూడా ప్రత్యర్తులపై చూపిన పౌరుషం ఆటలో చూపించడం లేదు. విరాట్ కోహ్లి కూడా ఈ సీజన్ లో పెద్దగా సఫలం కాలేదు. అలవాటయిన స్టేడియంలలో కూడా ఈ విధంగా ఆడి భారత్ ను కష్టాల్లోకి నెడుతున్నది సీనియర్ ఆటగాళ్లు మాత్రమే. రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి తరచూ విఫలం అవుతుండటంతో వెనక వచ్చే వారిపై వత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో విరాట్ కోహ్లి కూడా అంతే. పెద్దగా బ్యాట్ ను ఝళిపించింది లేకపోవడంతో పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సీరియస్ నెస్ లేకనేనా?
మరో సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ కూడా అంతే. రాహుల్ పై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే టీ 20కి దూరమయ్యారు. ఇక వన్డేలకు, టెస్ట్ లకు కూడా వీరిని దూరం పెడితే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. కుర్రోళ్లు నిలబడి అదే బౌలర్లను చీల్చి చెండాడుతున్నా సీనియర్ ఆటగాళ్లు మాత్రం నిర్లక్ష్యంతోనో, అతి విశ్వాసంతోనో తమ బ్యాట్ కు పదును పెట్టలేక భారత్ కు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికైనా టెస్ట్ లలోనూ టీంను ప్రక్షాళన చేస్తేనే భారత్ కు మరిన్ని విజయాలు దక్కుతాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కుర్రోళ్లతో నింపేయాలంటూ డిమాండ్ కూడా పెద్దయెత్తున వినిపిస్తుంది. ఈ మ్యాచ్ లతోనే భారత్ వరల్డ్ కప్ ఫైనల్ కు వెళుతుందా? లేదా? అన్నది తేలుతుందని తెలిసినా సీనియర్ ఆటగాళ్లతో సీరియస్ నెస్ లేకపోవడంపై నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News