IPL 2025 : ఢిల్లీ అదిరింది.. బెంగళూరు బెదిరింది
బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ కాపిటల్స్ అపూర్వమైన విజయాన్ని సాధించింది.;

ఐపీఎల్ లో కొత్త కెప్టెన్సీలో రూపుదిద్దుకున్న ఢిల్లీ కాపిటల్స్ వరస విజయాలతో దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే... ప్లేస్ ఎక్కడైనా సరే.. విజయాన్ని తమ సొంతం చేసుకుంటుంది ఢిల్లీ. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఓటమి లేకుండా వరసగా నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఢిల్లీ కాపిటల్స్ తన విజయాలను కంటిన్యూ చేస్తుంది. వరస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీని కట్టడి చేసేంందుకు ఏ జట్టు కూడా చేయని ప్రయత్నం లేదు. అయినా వాటి ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా నిన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ కాపిటల్స్ అపూర్వమైన విజయాన్ని సాధించింది. తన విజయపరంపరను కొనసాగించింది.
ఆరంభం అదిరినా....
తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ కాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీంలో ఓపెనర్లుగా దిగిన సాల్ట్, విరాట్ కోహ్లీలు మొదటి మూడు ఓవర్లలోనే యాభై పరుగులు సాధించడంతో బెంగళూరు సొంత గడ్డపై అత్యధిక పరుగులను సాధిస్తుందని భావించారు. కానీ సాల్ట్ అనవసర షాట్ కు రన్ అవుట్ కాగా 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత కోహ్లి కూడా 22 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చిఅవుట్ అయ్యాడు. ఇక దీంతో వరసగా వికెట్లు పడుతూ బెంగళూరు కష్టాల్లో పడింది. పడిక్కల్ ఒక్క పరుగుతో నిష్క్రమించాడు. రజత్ పాటిదార్ 25 పరుగులు చేశాడు. లివింగ్ స్టన్ నాలుగు, కృనాల్ పాండ్యా 18, డేవిడ్ 37 పరుగులు చేయడంతో మొత్తం ఇరవై ఓవర్లకు 163 పరుగులు చేసి బెంగళూరు తన ఇన్నింగ్స్ ను ముగించాల్సి వచ్చింది.
స్వల్ప పరుగుల లక్ష్యంతో...
స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ విజయం ముందుగానే ఖాయమయింది. డుప్లెసిస్, జెక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ త్వరగా అవుటయినా అభిషేక్ పోరెల్ ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దశలో విజయం బెంగళూరు వైపు చూసినా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ క్రీజుకు అతుక్కుపోయి 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం 17.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులను ఢిల్లీ కాపిటల్స్ చేసి విజయాన్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై సులువుగా విజయాన్ని సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ కు ఇది వరసగా నాలుగో విజయం కాగా, పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచింది.