India Vs Zimbabwe T20 : కసి తీర్చుకున్నారు.. అలా ఇలా కాదు.. వంద పరుగుల తేడాతో ఓడించారుగా

భారత్ రెండో టీ20 మ్యాచ్ లో జింబాబ్వే పై సూపర్ విక్టరీ సాధించింది

Update: 2024-07-08 03:39 GMT

భారత్ రెండో మ్యాచ్ లో టీం ఇండియాలో సత్తా చాటింది. భారత్ రెండో టీ20 మ్యాచ్ లో జింబాబ్వే పై సూపర్ విక్టరీ సాధించింది. వంద పరుగుల తేడాతో గెలుపొందింది. హరారేలో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలయిన భారత్ జట్టు రెండో మ్యాచ్ లో మాత్రం కసి తీర్చుకుంది. తానేంటో చూపించింది. తొలి మ్యాచ్ లో తడబడిన బ్యాటర్లు రెండో మ్యాచ్ లో విజృంభించి ఆడారు. ఎలా అంటే స్టేడియంలో సిక్సర్ల మోత పుట్టించారు. ఫోర్లతో జింబాబ్వే ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. ఒకరకంగా చెప్పాలంటే భారత్ రెండో టీ20లో ఊచకోత కోశారనే చెప్పాలి. ఎందుకంటే 234 పరుగులు చేసి అత్యధిక స్కోరును జింబాబ్వే ముందుంచారు.

భారీ స్కోరు చేసి...
కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు సాధించిందంటే భారత్ ఏ రకంగా చెలరేగిందో ఇట్టే అర్ధమవుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్ త్వరగానే అవుటయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లు రెచ్చిపోయారు. అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అభిషేక్ శర్మ అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ విజృంభించి ఆడాడు. రుతురాజ్ 77 పరుగులు చేశారు. రింకూ సింగ్ 48 పరుగులు చేశాడు. ఇరవై ఓవర్లలో 234 పరుగులు చేసిన భారత్ జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
లక్ష్య సాధనలో...
అయితే లక్ష్య సాధనలో తొలి నుంచి జింబాబ్వే ఆటగాళ్లు తడబడ్డారు. జింబాబ్వే ఆటగాళ్లలో వెస్టీ మధెవెర్ ఒక్కరే అత్యధిక పరుగులు చేశాడు. నలభై మూడు పరుగులు చేసి పరవాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూపెద్దగారాణించలేకపోయారు. బెనెట్ 26 పరుగులు చేసి అవుట్ కావడంతో అప్పటికే జింబాబ్వే ఓటమి ఖాయమయింది. అయితే ఇంత భారీ స్థాయిలో ఓటమి చవి చూస్తుందని ఎవరూ అనుకోలేదు. వంద పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే టీ20లలో ఇది ఎక్కువ అనే చెప్పాలి. భారత్ బౌలర్లలో ముఖేష్ కుమర్ మూడు, ఆవేశ్ ఖాన్ మూడు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి జింబాబ్వే పై విజయం సాధించేందుకు తోడ్పడ్డారు.


Tags:    

Similar News