Nithish Kumar Reddy : నితీష్ నువ్వు ఉండాలయ్యా సామీ.. నీ రాక మాకెంతో ఆనందం భయ్యా?

తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో తొలి సెంచరీనినమోదు చేశాడు

Update: 2024-12-28 08:54 GMT

నిజంగానే సీనియర్లందరూ బ్యాట్ ను ఎత్తివేస్తున్న తరుణంలో తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో తొలి సెంచరీనినమోదు చేశాడు. దీంతో భారత్ కు ఫాలో ఆన్ గండం తప్పింది. దాదాపు అందరు బ్యాటర్లు చేతులెత్తేసిన సమయంలో నితీష్ కుమార్ ఒంటరి, వీరోచిత పోరాటాన్ని చూసిన వారికి ఎవరైనా ముచ్చటేస్తుంది. తెలుగుజాతికే వన్నెతెచ్చే విధంగా నితీష్ ఈరోజు భారత్ పరువు గంగలో కలవకుండా నిలపగలిగాడంటే అతనిలో ని సత్తా ఏంటో అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇది. 1 - 1 స్కోరుతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ కూడా చేజారిపోతుందన్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి నిలదొక్కుకుని భారత్ ప్రతిష్టను కాపాడాడు. ఫాలో ఆన్ గండం నుంచితప్పించాడు.


నితీష్ వల్లనే...

ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే ఇది కూడా డ్రాగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పకతప్పదు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 358 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా 116 పరుగులు ఆస్ట్రేలియా కంటే వెనుకంజలో ఉంది. నిజంగా నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ ఝుళిపించకపోతే భారత్ ఈ మ్యాచ్ లో ఓటమి పాలయ్యేది. కానీ మనోడి వల్లనే ఇంతటి స్కోరు లభించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి వారు కూడా బ్యాట్ తడబడుతూ అవుటయి వెనుదిరిగిన వేళ మనోడు బ్యాట్ ను అలవోకగా తిప్పుతూ చేసిన విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తే మనోళ్లు అందరూ తక్కువ పరుగులకే అవుటయిన వేళ నితీష్ కుమార్ రెడ్డి నిఖార్సయిన ఆట చూపాడు.


ప్రత్యర్థి బౌలర్లను...
నితీష్ కుమార్ రెడ్డి కేవలం 171 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ పై ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన రికార్డు సృష్టించాడు. నితీష్ కుమార్ రెడ్డిని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ మ్యాచ్ భారత్ కు ఎంత కీలకమో తెలుసు. వరల్డ్ కప్ లో ఆడాలంటే ఆస్ట్రేలియాపై నెగ్గకున్నా డ్రాగా ముగిసేలా నితీష్ చూపిన ఆటకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు. అందరికీ దడ పుట్టించాడు.ఈ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అన్ని టెస్ట్ లలోనూ సత్తాచాటాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి స్థానం టీం ఇండియా జట్టులో పదిలమయినట్లేనని అనుకోవాలి. ఐపీఎల్ లో అరంగేట్రం చేసి టీం ఇండియాలో కాలుమోపి నితీష్ తన బ్యాట్ తో చేస్తున్న విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి. శభాష్ నితీష్.. తెలుగోడి సత్తాయే కాదు.. ప్రపంచంలో ఇండియా సత్తా ఏంటో నీ ఆట ద్వారా చూపించావంటూ నెట్టంట ప్రశంసలు వినపడుతున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News