David Warner: ఊహించని నిర్ణయం తీసుకున్న డేవిడ్ భాయ్
కేవలం టెస్టులకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని గతంలో చెప్పిన డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్.. అభిమానులు డేవిడ్ భాయ్ అని అంటారు. అయితే కేవలం టెస్టులకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని గతంలో చెప్పిన డేవిడ్ వార్నర్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. వన్డే క్రికెట్ కు కూడా దూరమవుతున్నట్లు స్పష్టం చేసాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్ వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచామని.. వన్డేలకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను అందుబాటులో ఉంటానని డేవిడ్ వార్నర్ తెలిపాడు.
డైనమిక్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ వారం పాకిస్తాన్‌తో తన వీడ్కోలు టెస్ట్ ను ఆడనున్నాడు. 37 ఏళ్ల అతను బుధవారం తన సొంత నగరం సిడ్నీలో తన 112వ చివరి టెస్టులో ఆడనున్నాడు. అతడి కెరీర్ లో 26 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో 44.58 సగటుతో 8,695 పరుగులు చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వన్డేల నుండి కూడా రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. 2015, 2023లో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్‌ను గెలవడంలో సహాయం చేశాడు. కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నానని.. అందుకే వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నానని తెలిపాడు వార్నర్. భారతదేశంలో ప్రపంచ కప్ గెలవడం ఒక భారీ విజయంగా నేను భావిస్తున్నాను. అందుకే తాను వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం ఇదే సరైన సమయమని భావిస్తూ ఉన్నానని తెలిపాడు. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నా. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరం అయితే అందుబాటులో ఉంటానన్నాడు. 2009 జనవరి 18న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే అరంగేట్రం చేసాడు. చివరి వన్డే మ్యాచ్ 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్.. 6,932 పరుగులు చేశాడు.