ఒంటరిగా పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం: బండి సంజయ్
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని, ఈ సారి తప్పకుండా అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని, ఈ సారి తప్పకుండా అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని చంపాపేటలో సోమవారం నాడు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సంజయ్ ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ గత తొమ్మిది ఏళ్లలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను పల్లె పల్లెన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 'తెలంగాణలో కొలువులు కావాలంటే.. కమలం రావాల్సిందే' అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎంతో అభివృద్ధి జరిగేదన్నారు. తెలంగాణలో డబుల్ అభివృద్ధి.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే సాధ్యమవుతందనే అంశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని కోరారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశాన్ని ప్రగతి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేంద్రం చేకూర్చిన ప్రయోజనాలను ప్రతి ఇంటికి తెలియజేసేందుకు మే 30వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు.
తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం ప్రధాని మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని, అయితే దీనికి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. కేసీఆర్ మూర్ఖత్వంతో రాష్ట్రంలో అనేకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ఇస్తున్న నిధులను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. ప్రధాని మోదీ పాలనతో భారత్ విశ్వగురు స్థానానికి ఎదుగుతోందన్నారు. రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు, వీటితో పాటు గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న డెవలప్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని, మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన స్కీంలను బండి సంజయ్ వివరించారు.