నేటి నుంచి బండి సంజయ్ పాదయాత్ర
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నాలుగో విడత జరగనున్న ఈ యాత్ర పది రోజుల పాటు సాగనుంది. కుత్బుల్లాపూర్ నుంచి బయలు దేరిన ఈ యత్ర 115.3 కిలోమీటర్ల మేర సాగనుంది. ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మధ్యలో ఆగుతూ బండి సంజయ్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో...
ఇప్పటి వరకూ మూడు విడతల్లో ప్రజాసంగ్రామ పాదయాత్ర జరిగింది. మొత్తం 1,128 కిలోమీటర్ల మేర ఈ యాత్ర పూర్తయింది. నాలుగో విడత పాదయాత్ర 48 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సాగనుంది. రోజుకు పది నుంచి పదకొండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మధ్యలో ఈ నెల 17వ తేదీన యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరుకానుండటంతో ఆరోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిస్తారు. ఈనెల 22న పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నాలుగో విడత పాదయాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.