KTR : కేటీఆర్ నోరుజారానని తెలుసుకున్నారుగా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ ఆచితూచి మాట్లాడతారు. ఎప్పుడూ రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత దూషణలు ఆయన ప్రసంగాల్లో చోటు ఉండదు. కానీ ఒక్కోసారి నోరు జారడం మామూలే. అలా నోరు జారిన కేటీఆర్ తన తప్పును తెలుసుకుని మహిళలకు క్షమాపణ చెప్పారు. తాను అన్న కామెంట్స్ ను వెనక్కు తీసుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై..
దీనిపై పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బస్సులో అల్లికలు, కుట్లు తామ వద్దనలేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్స్ లు వేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అనడంతో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బస్సుల్లో సీట్లు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ సిబ్బంది కూడా అనేకసార్లు ఇబ్బంది పడ్డారని ఆయన గుర్తు చేశారు. బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. అయితే దీని మీద రచ్చ కావడంతో కేటీఆర్ మహిళలను ఉద్దేశించి తాను అలా అనలేదని, యధాలాపంగానే తాను ఈ వ్యాఖ్యలను చేశానని, ఎవరైనా నొచ్చుకుని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేశారు.