Telangana : నేటి నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభం
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది.
తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను నమోదు చేయనున్నారు. కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇందుకోసం అనేక ప్రశ్నలను సిద్ధం చేసింది. ఈ ప్రశ్నలను ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమానులను ప్రశ్నించి అడిగి తెలుసుకుని వివరాలను రాసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మొత్తం ఎనభై వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. మండలాల వారీగా కులగణన చేసిన నివేదికను కంప్యూటరీకరణ చేయనున్నారు. ఉపాధ్యాయులను ఇందుకోసం నియమించారు.
75 ప్రశ్నలు...
ఈరోజు నుంచి మూడు రోజు లపాటు ఇళ్ల జాబితా నమోదును చేపట్టనున్నారు. గ్రామ, పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం పేర్లను కోడ్ రూపంలో, వార్డు నెంబరు, ఇంటి నెంబరుతో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 9వ తేదీనుంచి ముద్రించిన ఫార్మాట్ లో ఎన్యుమరేటర్లు ప్రజల నుంచి వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ఇందుకోసం యాభై ఆరు ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు సిద్ధం చేశారు. అంటే మొత్తం 75 ప్రశ్నల వరకూ సమాధానం ఒక్కొక్క కుటుంబం చెప్పాల్సి ఉంటుంది. ఆధార్, ధరణి పాస్ బుక్, సెల్‌ఫోన్ నెంబర్లు కూడా నమోదు చేసుకుంటారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
సంతకం చేయాల్సి ఉంటుంది...
అన్ని వివరాలను చెప్పిన తర్వాత కుటుంబ యజమాని నుంచి సంతకం తీసుకుంటారు. తాము చెప్పిన వివరాలన్నీ నిజమేనని చెబుతూ ఇంటి యజమాని సంతకం చేయాల్సి ఉంది. దీంతో ఎన్యుమరేటర్లకు ఒక్కొక్క ఇంటిలో కులగణన పూర్తి చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశముంది. ఇందుకోసం ఎన్యుమరేటర్లకు నెల రోజులు గడువు విధించారు. ఎక్కువ మంది టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటంతో వారికి అలవాటయిన పని కావడంతో సులువుగా కులగణన చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. కులగణన ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది.