Malla Reddy : పాపం.. మల్లన్నకు ఎంత కష్టమొచ్చింది... మిల్క్ కాదన్నా.. అవి ల్యాండ్స్...?

వందల కోట్లకు అధిపతి అయిన చామకూర మల్లారెడ్డి 2014లో రాజకీయాల్లోకి తొలిసారిగా వచ్చారు

Update: 2024-05-19 06:28 GMT

తెలంగాణ రాజకీయాల్లో చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయనను రాజకీయాల్లో ఒక హాస్యనేతగానే చూస్తారు కానీ.. ఆయన ఆస్తులు చూసిన వారికి ఎవరికైనా అలా అనిపించదు. ఫక్తు పల్లెటూరి భాషలో.. ఆయన మాట్లాడే తీరు కొన్ని సార్లు ఆకట్టుకుంటున్నా.. మరికొన్ని సార్లు ఎబ్బెట్టుగానూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మెడికల్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో అత్యధిక ఫీజులు తీసుకుంటున్నారని ఆరోపణలతో పాటు వేలాది ఎకరాలను భూమిని కబ్జా చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు. ప్రభుత్వ భూములను సయితం వదలరని వినికిడి. పేదల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటారని ప్రత్యర్థులు వదలకుండా ఆరోపిస్తారు.

వందల కోట్లకు...
వందల కోట్లకు అధిపతి అయిన చామకూర మల్లారెడ్డి 2014లో రాజకీయాల్లోకి తొలిసారిగా వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే అప్పడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఎంపీ అయిన మల్లారెడ్డి రాష్ట్ర విభజన జరగడంతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అందులోకి షిఫ్ట్‌ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. పేరు కార్మిక శాఖ అయినా ఆయన తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. బుగ్గకారులో తిరుగుతూ బీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మల్లన్న ను స్పెషల్ గా ట్రీట్ చేస్తారంటారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో...
2023 ఎన్నికల్లోనూ మేడ్చల్ నుంచి ఆయన, మల్కాజ్‌గిరి నుంచి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్లు దక్కించుకుని పోటీ చేసి మరీ బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు తీసుకుని మల్లన్న మరోసారి తనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమని అనుకున్నారు. బ్యాడ్ లక్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అధికారంలో ఉండగా అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒంటికాలు మీద లేచే వారు. తొడగొట్టి సవాల్ కూడా విసిరాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అందులోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనపై ఇన్నాళ్లూ భూ కబ్జా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ నేతలే కావడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి దిగడంతో ఇప్పుడు న్యాయమంటూ కోర్టుల చుట్టూ పరుగెత్తాల్సి వస్తుంది.
భూవివాదంలో...
తాజాగా సుచిత్ర లోని సర్వే నెంబర్లు 82,83లో భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయన తన స్థలాన్ని ఎవరో ఆక్రమించుకున్నారంటూ వాళ్లు వేసిన ఫెన్సింగ్ ను తొలగించే ప్రయత్నం చేయడంతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లలో రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఎవరినీ అనుమతించకుండా అక్కడ సర్వే చేస్తున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 2011లో తాను ఈ ల్యాండ్ ను కొన్నానని మర్రి రాజశేఖర్ రెడ్డి చెబుతుండగా, మరికొందరు మాత్రం ఆ స్థలం తమదేనని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టులకు సెలవులు ఉండటంతో అక్కడి స్థల వివాదంపై ఎటూ తేలకుండా ఉంది. పదేళ్ల పాటు భూముల విషయంలో ఎలాంటి నిద్ర లేకుండా గడిపిన మల్లన్నకు ఈ ఐదు నెలల నుంచి మాత్రం కునుకు లేకుండా పోతుంది.


Tags:    

Similar News