Revanth Reddy : రైతు కూలీలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాలో పన్నెండు వేలు
రైతు కూలీలకు కూడా ఆర్థిక సాయం అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసింది. అయితే ఇదే సమయంలో రైతు కూలీలకు కూడా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు ముందు మ్యానిఫేస్టోలో ప్రకటించినట్లుగానే వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించేందుకు సిద్ధమయింది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఈ సాయాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైతు కూలీలు ఎవరన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.
ఎంతమంది ఉన్నారు?
రాష్ట్రంలో ఎంత మంది వ్యవసాయ కూలీలున్నారు? వారి జీవన పరిస్థితులు ఏంటి? వారికి ప్రభుత్వం నుంచి ఏదైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? వంటి అంశాలతో ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత త్వరలోనే రైతు కూలీలకు సంబంధించిన వివరాలతో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.అనంతరం వారిలో అర్హులైన వారికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. అంటే తొలి విడత సాయంగా ఆరు వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధమయినట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
వారికే ఇస్తారా?
ఇప్పటికే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. వ్యవసాయకూలీలకు పన్నెండు వేలు తమ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ లెక్కలు తీస్తున్నారు. అయితే ఉపాధి హామీ జాబ్ కార్డులున్న వారిని రైతు కూలీలుగా పరిగణిస్తారా? లేక నిజంగానే వ్యవసాయ పనులకు వెళ్లే వారి లెక్కలు తీస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఉపాధి హామీ పనులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే ఉన్నారని మాత్రం అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రైతు భరోసా నిధులతో పాటు వ్యవసాయ కూలీలకు సంబంధించిన నిధులు కూడా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీనికిసంబంధించిన విధివిధానాలను ఇంకా నిర్ణయించాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now