Revanth Reddy : కేసీఆర్ రోజా ఇంట్లో పులుసు తిని...ఏపీకి ప్రాజెక్టులకు అప్పగించారు

రోజా ఇంట్లో పలుసు తినొచ్చి ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారంటూ కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు

Update: 2024-02-09 11:37 GMT

రోజా ఇంట్లో పలుసు తినొచ్చి ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారంటూ కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై దమ్ముంటే నల్లగొండలో కాదు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని ాయన కోరారు. అసెంబ్లీ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణలో మాత్రం రెండు టీఎంసీలను కూడా తరలించలేకపోయారన్నారు. కృష్ణా జలాల మీద కేసీఆర్ మరణ శాసనం రాశారన్నారు. రోజా ఇచ్చిన పులుసు తిని, వాళ్ల ఇచ్చిన అలుసుతోనే సాగర్ ఘటన చోటు చేసుకుందన్నారు. జగన్ మన ప్రాజెక్టులపై తుపాకి పెట్టి నీరు తరలించుకుపోతున్నా వీరు ఫాం హౌస్ లో నిద్రపోతున్నారన్నారు.

జగన్ తుపాకులు ఎక్కుపెట్టి...
కేసీఆర్ సహకారం లేకుండానే సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు రాగలరా? అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ బేసిన్లు లేవని, భేషజాలు లేవని అన్నది నిజం కాదా? అని నిలదీశారు. పాలమూరును ఎండబెట్టింది ఎవరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాలపై పెత్తనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది కేసీఆర్ అవునా? కాదా? అని గద్దించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కాకపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యం కాదా? అని అన్నారు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిని పక్కదోవ పట్టించడానికి కృష్ణా జలాల వివాదాన్ని తీసుకు వచ్చారని ఆయన దుయ్య బట్టారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నా కళ్లప్పగించి చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులకు....
పునర్విభజన చట్టం రాసింది తానేనని అని అన్న కేసీఆర్ ప్రాజెక్టులు ఇలా అప్పగిస్తామని రాశారా? అని ప్రశ్నించారు. రాయలసీమకు వెళ్లి రతనాల సీమను చేస్తామని చెప్పింద నిజం కాదా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతి చేసిన కేసీఆర్ ప్రభుత్వం కోటి నీళ్లిస్తామని చెప్పి అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ జల హక్కులను కేంద్రానికి కేసీఆర్ రాసిచ్చారన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాను కొట్లాడుతుంటే తన కాళ్లకింద కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు బీజం పడింది మీ డైనింగ్ టేబుల్ మీద కాదా? అని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.


Tags:    

Similar News