Chief Ministers Meeting : సేమ్ స్పాట్.. సేమ్ ఛెయిర్స్..కానీ సీఎంలే మారారు.. అదీ అసలు సీన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు.

Update: 2024-07-04 06:43 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఎల్లుండి సాయంత్రం ఈ సమావేశం ప్రజా వేదికలో జరగనుంది. గతంలోనూ ఇదే ప్రజాభవన్ (అప్పట్లో ప్రగతి భవన్) లో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సమావేశమయ్యారు. కానీ ఐదేళ్ల కాలం మాత్రం విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల మధ్య తలదూర్చడం ఇష్టం లేక వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. ఆస్తుల పంపకాల నుంచి బకాయీల వరకూ ఏ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అయితే చంద్రబాబు చొరవతో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఇప్పటికైనా పదేళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలకు ఒక దారి దొరుకుతుందా? అన్నదే ప్రశ్న. ఆరో తేదీ సాయంత్రం ఏం జరుగుతుందన్న దానికన్నా.. ఇద్దరు సీఎంల భేటీపై రెండు రాష్ట్రాల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.

అంత సులువు కాదుగా?
అయితే విభజన సమస్యలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవడం మాత్రం అంత సులువు కాదు. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఈ ఒక్క సమావేశంతో అవతాయనుకుంటే అత్యాసే అవుతుంది. ఎందుకంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యం. ఆస్తులు, కార్పొరేషన్ల పంపకాలు చాలా క్లిష్టమైనవి మారే అవకాశాలున్నాయి. ఆస్తుల పంపకాల్లో ఇద్దరు పట్టుబట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల పంపకం అంత ఈజీ కాదు. తెలంగాణ ఆర్టీసీ ఆస్తుల్లో తమ వాటా తేల్చమని ఏపీ అంటుంది. ఇప్పుడు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తి కావడంతో హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీ ఆస్తులపై ఏపీకి హక్కు ఎక్కడిదని తెలంగాణ నుంచి ప్రశ్నలు వినపడతాయి. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసిన ఆస్తుల్లో తమకు వాటా ఉందని ఏపీ వాదించవచ్చు. ఇది పీటముడిగా మారే అవకాశాలున్నాయి.
విభజన చట్టంలోని...
ఇక కార్పొరేషన్ల విషయంలోనూ అదే పరిస్థితి. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు దక్కుతుంది. చట్టంలోని షెడ్యూల్ 9 ,10లో జాబితా లోకి కార్పొరేషన్లున్నాయి. మొత్తం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్నాయి. అనేక కార్పొరేషన్లు వీటి పరిధిలో ఉండటంతో వీటిని సానుకూలంగా, చర్చలతో పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. పదో షెడ్యూల్ లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, ఏపీ పోలీస్ అకాడమి, వంటి వాటిపై ఇప్పటికే షీలాబేడీ కమిటీ చేసిన సిఫార్సులను ఎవరూ అంగకరించకపోవడం ఇందుకు నిదర్శనం. తమకు విద్యుత్తు బకాయీలే తెలంగాణ నుంచి ఐదు వేల కోట్ల బకాయీ ఉందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ వాదిస్తుంది. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా?
విలీన గ్రామాల అంశం కూడా...
ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి కోరి కష్టాలను కొని తెచ్చుకుంటుందా? అన్నదే ప్రశ్న. ఇక ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు పోలవరంలో రాష్ట్ర విభజన సమయంలో కలిపేశారు. అయితే ఖమ్మం జిల్లాలోని ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకుల పాడు గ్రామ పంచాయతీలు ఏపీలో విలీనమయ్యాయి. ఇప్పుడు వాటిని భద్రాచలంలో కలిపేందుకు అంగీకరించాలని తెలంగాణ నుంచి వత్తిడి వస్తుంది. ఆ ప్రాంత ప్రజలు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గ్రామాలను భద్రాచలంలో కలిపేలా చర్చల్లో ప్రస్తావించాలని లేఖ రాయడంతో ఇప్పుడు అది కూడా ఒక సమస్యగా మారనుంది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని మాట్లాడుకోవడం మంచిదే. కానీ చర్చల్లో సానుకూలతలు వచ్చి ఫలితాలు కూడా వచ్చేస్తాయని ఆశించడం అంతే తప్పు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎవరి రాష్ట్రంలో వారికి రాజకీయంగా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News