పెండింగ్ చలాన్లకు నేటితో ఆఖరు
తెలంగాణలో పెండింగ్ చలాన్లకు నేటితో గడువు ముగియనుంది. పెండింగ్ చలాన్లకు రాయితీ నేటి వరకూ మాత్రమే లభిస్తుంది
తెలంగాణలో పెండింగ్ చలాన్లకు నేటితో గడువు ముగియనుంది. పెండింగ్ చలాన్లకు రాయితీ నేటి వరకూ మాత్రమే లభిస్తుంది. రేపటి నుంచి మొత్తం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. గత నెల 26వ తేదీ నుంచి రాయితీలతో పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారీ మొత్తంలో రాయితీని ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాయితీని ప్రకటించడంతో వాహనదారులు ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
రాయితీతో ఆదాయం...
రాయితీలు ఇవ్వడంతో పెండింగ్ చలాన్లపై ఇప్పటి వరకూ ప్రభుత్వానికి దాదాపు ఎనభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. ఈరోజు ఆఖరి రోజు కావడంతో మిగిలిన వారు కూడా చెల్లిస్తే వంద కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ మంది పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు. ద్విచక్రవాహనాలకు ఎనభై శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఆటోలకు ఎనభై శాతం, ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.