Telangana : సీజనల్ వ్యాధులతో జనం బెంబేలు.. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిట

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి

Update: 2024-07-30 06:59 GMT

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. అనేక మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. టైఫాయిడ్, డెంగీ వంటి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది జ్వరపీడితులున్నారని గుర్తించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నిలోఫర్ లోని చిల్డ్రన్స్ ఆసుపత్రి, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఎక్కువ మంది జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు వంటి లక్షణాలతో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

డెంగీ కేసులు...
హైదరాబాద్ నగరంలో డెంగీ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మూసాపేటలో ఒక చిన్నారి డెంగీతో మరణించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. దోమల కారణంగా డెంగీ వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతుండటంతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని మురికి వాడల్లో ఎక్కువగా ఫాగింగ్ చేయాలని నిర్ణయించారు. ఇళ్లలో కూడా నీరు నిల్వకుండా ఉండేలా చూసుకోవాలని, దోమల వ్యాప్తికి అదే కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం కనిపిస్తే ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులు...
డెంగీతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ సోకితే ప్లేట్‌లెట్స్ పడిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో కేసులు నమోదయినట్లు వైద్యులు చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రికి రోజుకు కనీసం పదికేసులు ఇలాంటివి వస్తున్నాయని వైద్యులు తెలిపారు. ప్రధానంగా చిన్నారులు ఈ వ్యాధుల బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారంటున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు మాత్మే కాదు ప్రయివేటు ఆసుపత్రులను కూడా ఎక్కువ మంది ఆశ్రయిస్తుండటంతో అధికారికంగా లెక్కలు తెలియడం లేదు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నారు.



Tags:    

Similar News