తెలంగాణలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
పీజీ సీట్లను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని గతేడాది ఏప్రిల్ లో కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు వరంగల్ కమిషనరేట్ లో..
తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి.. అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని పలు కాలేజీలపై ఈడీ దాడులు చేసింది. కామినేని, మల్లారెడ్డి, ఎస్వీఎస్, మమత మెడికల్ కాలేజీ, మహేందర్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలు, వాటి బ్రాంచుల్లో ఏకకాలంలో 11 బృందాలు.. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాల రక్షణలో సోదాలు నిర్వహించాయి.
పీజీ సీట్లను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని గతేడాది ఏప్రిల్ లో కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు వరంగల్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. ప్రణాళిక ప్రకారం పీజీ సీట్లను బ్లాక్ చేసి.. వాటిని అమ్ముకుని వందలకోట్ల రూపాయలు ఆర్జించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ సొమ్మంతా ఏం చేశారన్నదానిపై కూపీ లాగుతోంది. కామినేని, మల్లారెడ్డి, ఎస్వీఎస్, మమత మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు ముగిసినట్లు సమాచారం. ఆయా కాలేజీలు, సంస్థల చైర్మన్ల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో ఈడీ ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకుందన్నది తెలియాల్సి ఉంది. గురువారం కూడా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 20 బృందాలు సోదాలు చేస్తున్నాయి.