తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రేషన్ దుకాణం వద్ద కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ దుకాణం ఫ్లెక్సీపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ నిలదీసిన ఆమె.. కేంద్ర వాటా ఎంత? రాష్ట్రం ఖర్చు చేస్తున్నదెంత? అంటూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వైరల్‌గా మారడంతో నిర్మల సీతారామన్‌పై టీఆర్ఎస్ నేతలతో సహా పలువురు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
సొంత పార్టీ సీనియర్ నేత.. ముక్కుసూటిగా మాట్లాడే నేతగా పేరున్న మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మంత్రి నిర్మల ప్రవర్తనపై సీరియస్‌గా స్పందించారు. చెంచాగిరీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె అవమానకరరీతిలో చెంచాగిరీని ప్రదర్శించారని.. అంతకంటే సంబంధింత మంత్రికి లేఖ రాస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం తప్పుబట్టారు. ఆమె ప్రవర్తించిన తీరు తనను భయపెట్టిందని.. సివిల్ సర్వెంట్లను సమర్థంగా పనిచేయకుండా బీజేపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.