VALENTINE'S DAY : భజరంగ్ దళ్ ఎప్పటికీ అలా చేయదు
భారత సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమైన ప్రేమికుల రోజుకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విష సంస్కృతిని
ఫిబ్రవరి 14. ఈ రోజును ప్రపంచమంతా వాలెంటైన్స్ డే గా జరుపుకుంటుంది. అందులో మన దేశం కూడా ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టిల్లుగా చెప్పుకునే మన దేశంలో యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతోంది. దానినే విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. మరో మూడ్రోజుల్లో వాలెంటైన్స్ డే ఉండటంతో.. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, విదేశీ విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకం అని విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి)ప్రాంతీయ అధ్యక్షుడు ఎం. రామరాజు తెలిపారు.
భారత సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమైన ప్రేమికుల రోజుకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విష సంస్కృతిని ప్రభుత్వాలు కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజు పేరుతో యువత ఎవరైనా ఫిబ్రవరి 14న విచ్చలవిడిగా బయట తిరిగితే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు అని చెప్పుకుని కొందరు ప్రేమికుల రోజున యువతి, యువకులకు పెళ్లిళ్లు చేస్తున్నారని, తాము అలా చేయబోమని భజరంగ్ దళ్ నేతలు రామరాజు, శివరాములు స్పష్టం చేశారు. అలాగే పబ్బులు, రెస్టారెంట్లలో ప్రేమికుల రోజు వేడుకలను జరుపవద్దని హెచ్చరించారు. వాలెంటైన్స్ డే కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్తంగా గ్రీటింగ్ కార్డులను దహనం చేస్తామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14ను పుల్వామా ఘటనలో అమరులైన సైనికులను స్మరిస్తూ''అమర జవాన్ దివస్'' అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తామని చెప్పారు.