ప్రజాయుద్ధ నౌక 'గద్దర్' కన్నుమూత
గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు.
ప్రజా కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు 'గద్దర్'(74) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం ధృవీకరించారు. గద్దర్ మరణంపై అపోలో యాజమాన్యం కూడా బులిటెన్ విడుదల చేసింది. రెండు రోజులక్రితం ఆయన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. అయితే.. ఊపితిత్తులు, యూరినరీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆదివారం(ఆగస్టు5) మధ్యాహ్యం మూడు గంటలకు మృతి చెందారు.
గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. గాయకుడిగా ఆయన తెలంగాణ సమాజంపై చెరగని ముద్రవేశారు. మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడటంతోపాటు ఆ పాటలో నటించి గుర్తింపు పొందారు. ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమా" అనే పాట విపరీతమైన ప్రజాదరణ పొందింది. 'పొడుస్తున్న పొద్దు మీద' అంటూ ఆయన ఆలపించిన పాట తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కదిలించింది. ఉద్యమకారుడిగా ఎన్నో కార్యక్రమాల ద్వారా జనాన్ని చైతన్య పరిచిన గద్దర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.