Summer Effect : నేటి నుంచి ముదిరిపోనున్న ఎండలు.. బయటకు వచ్చారో ఇక అంతే
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానుంది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి.;

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానుంది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరికలు వాతావరణ శాఖ చేసింది. అధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నలభై డిగ్రీలు దాటేశాయి. అదే సమయంలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
నేడు వడగాలులు వీచేది ఇక్కడే...
ఆంధ్రప్రదేశ్ లో 202 మండాలాల్లో వడగాలులు వీయనున్నాయి. సోమవారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యం జిల్లా 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నేడు శ్రీకాకుళం జిల్లాలో16, విజయనగరంలో 10, పార్వతీపురం మన్యంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 16, కాకినాడ జిల్లాలో 15, కోనసీమ జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో19, పశ్చిమగోదావరి జిల్లాాలో 3, ఏలూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, ఎన్టీఆర్ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో ఒకటి, పల్నాడు జిల్లాలో19 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
తెలంగాణలోనూ...
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.