ఉచితంగా సినిమా చూసేయొచ్చు

భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలను ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Update: 2023-08-13 02:16 GMT

భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలను ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్రం గురించి పిల్లలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సూచనలు చేశాయి. ఇందులో భాగంగా పలు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా గాంధీజీకి సంబంధించిన చలనచిత్రాలను చూపించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా పిల్లలకు ఉచితంగా సినిమాలను ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి కలెక్టర్ ఉదయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 5 సినిమా థియేటర్లను ఎంపిక చేశారు. ఆగస్ట్ 14 నుంచి ఈనెల 24 వరకు అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా గాంధీజీకి సంబంధించిన చలన చిత్రాలు చూపించనున్నారు. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో సైతం విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక థియేటర్, కల్వకుర్తిలో రెండు థియేటర్లు, కొల్లాపూర్, అచ్చంపేటలో ఒక్కో థియేటర్ చొప్పున జిల్లాలో మొత్తం 5 థియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నారు. విద్యార్ధులను థియేటర్లకు ఉచితంగా తీసుకెళ్ళి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు సైతం వీక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆగస్టు, 14 వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది. 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా, 20వ తేదీన ఆదివారం నాడు చిత్ర ప్రదర్శన ఉండదని తెలిపారు. ఆగష్టు, 16 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉండనుంది.


Tags:    

Similar News