50 అడుగులు దాటిన ఉగ్రగోదారి.. రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చర్ల-భద్రాచలం మధ్యరాకపోకలు తెగిపోయాయి. తేగడ వంతెన వద్ద కూడా గోదావరి..
భద్రాచలం వల్ల గోదావరి నది మరింత ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 9 గంటలకు నదినీటిమట్టం 50.50 అడుగులకు చేరడంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి 9.45 గంటలకు నది నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండోప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదిలో 12,86,136 క్యూసెక్కుల వరద నీరు పారుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రహదారులపైకి నీరు చేరడంతో.. ప్రజలు వాగులు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు.
గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చర్ల-భద్రాచలం మధ్యరాకపోకలు తెగిపోయాయి. తేగడ వంతెన వద్ద కూడా గోదావరి ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో.. వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం నుంచి వరదనీరు ధవళేశ్వరానికి పోటెత్తడంతో.. ఏపీలో లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లో ఎగువ ప్రాజెక్టులకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా వరదప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో..అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.