తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది

Update: 2023-08-15 06:26 GMT

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. ఆగస్టు 18, 19 తేదీలలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ ప్రక‌టించింది. ఈ నేప‌థ్యంలోనే శుక్ర, శనివారాల్లో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఇదిలావుంటే.. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్ విషయానికొస్తే.. రాబోయే మూడు రోజుల పాటు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని టీఎస్‌డీపీఎస్ పేర్కొంది.

టీఎస్‌డీపీఎస్ ప్రకారం.. నిన్న తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 70.3 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌గా.. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 12.3 మి.మీ వర్షం కురిసింది.

ఈ సీజన్‌లో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 466.9 మి.మీ కాగా 582.4 మి.మీ న‌మోదైంది. హైదరాబాద్‌లో సగటు వర్షపాతం 363.3 మి.మీ.తో పోలిస్తే.. 450.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది.


Tags:    

Similar News