Heavy Rain : వర్షాలు ఇంకా కురుస్తాయట... మరో అల్పపీడనం పొంచి ఉంది
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత మూడు ర్ోజుల నుంచి కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో ఐదు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 18,19వ తేదీల్లో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కుండపోత వర్షం పడితే అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం కురిసినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లడమే సురక్షితమని చెబుతున్నారు.
పురాతన భవనాలపై....
ఇక హైదరాబాద్ లోని పురాతన భవనాలపై కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కొన్ని భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పురాతన భవనాలకు కొన్నింటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఖాళీ చేయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో బస్తీలు, కాలనీల్లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. దోమల బెడద కూడా ఎక్కువయిందని చెబుతున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ కార్యాలయాలున్న మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏపీలోనూ కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఇక వరసగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నాయి వాతావరణ శాఖ వర్గాలు.